పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇది మలయాళ సూపర్ హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకరణ సోమవారం తిరిగి ప్రారంభమైంది. నిజానికి ఈనెల 12నే ఈ సినిమా మొదలవుతుందనుకున్నారు.
ఆ మేరకు షూట్ స్టార్ట్ చేయడానికి పవన్ కూడా అంగీకరించారు. కానీ మధ్యలో సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ తప్పుకోవడంతో షూటింగ్ ఆగింది. దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ను తీసుకున్నారు. ఈ భారీ మార్పు కారణంగా కొత్త షెడ్యూల్ ను ఈరోజు నుండి మొదలుపెట్టారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ షురూ అయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఓ ఇంట్రస్టింగ్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో పోలీస్ డ్రెస్ లో ఉన్న పవన్ వెనక నుంచి కనిపించారు. భీమ్లా నాయక్ ఆన్ డ్యూటీ అన్న క్యాప్షన్ తో పవన్ పాత్ర పేరును కూడా చెప్పకనే చెప్పారు. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ మాములుగా లేదు. చూస్తుండగానే ఇండియా లెవెల్లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిపోయింది.
అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒరిజినల్ లో బిజు మీనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ఇందులో పవన్ కి జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ కనిపించనుంది. ఇక రానా సరసన ఐశ్వర్యా రాజేష్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
పవన్ ఈ సినిమా సెట్స్ పైకి రావడంతో 'హరిహర వీరమల్లు' సినిమా యూనిట్ లో ఉత్సాహం వచ్చింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే పవన్.. క్రిష్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొన్నామధ్య విడుదలైన చిన్నపాటి టీజర్ ప్రకంపనలు సృష్టించింది.