'భీమ్లా నాయక్' విడుదల ఎప్పుడు? కుదిరితే ఫిబ్రవరి 25న... లేదంటే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ఆల్రెడీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే... 'డీజే టిల్లు' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీకి 'భీమ్లా నాయక్' విడుదల గురించి మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన "మొన్న పోస్ట‌ర్‌లో 25న గానీ... ఏప్రిల్ 1న గానీ అని చెప్పాం కదా! మీరు జగన్ (ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి) గారిని అడగాలి. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ ఎప్పుడు తీసేస్తే... అప్పుడు సినిమా విడుదల!" అని సమాధానం ఇచ్చారు. సో... ఫిబ్రవరి 25కి ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీతో షోలు వేసుకోవడానికి అనుమతి వస్తే... 'భీమ్లా నాయక్' రిలీజ్ అవుతుందన్నమాట. లేదంటే ఏప్రిల్ 1కి వాయిదా పడుతుంది. 


సాధారణంగా సినిమా వేడుకల్లో తక్కువగా మాట్లాడే నాగవంశీ, 'డీజే టిల్లు' విడుదల కార్యక్రమంలో కొద్దిగా మాట్లాడారు. "డీజే టిల్లు' యూత్ సినిమా అయితే... 'భీమ్లా నాయక్' మాసివ్ సినిమా. రెండు సినిమాలకు సంబంధం లేదు. 'డీజే టిల్లు' కథ నచ్చడంతో ఈ సినిమాలో కొంత ఇన్వాల్వ్ అయ్యాను. ఈ సినిమా మీద మాకు చాలా నమ్మకం ఉంది. గ్యారెంటీగా హిట్ కొడుతుంది. 'భీమ్లా నాయక్' కాకుండా ఈ ఏడాది మా సంస్థ నుంచి మూడు చిన్న సినిమాలు వస్తాయి" అని సూర్యదేవర నాగవంశీ చెప్పారు.


పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటికి జంటగా సంయుక్తా మీనన్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించడంతో పాటు ఓ పాట కూడా రాశారు. తమన్ సంగీతం అందించారు. 


'డీజే టిల్లు', 'భీమ్లా నాయక్' కాకుండా ప్రస్తుతం సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో ధనుష్ హీరోగా 'సార్' సినిమా రూపొందుతోంది. అలాగే, నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గ‌ణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ... 'స్వాతిముత్యం' సినిమాను రూపొందిస్తున్నారు. ఆ రెండూ కూడా ఈ ఏడాది విడుదల కానున్నాయి.