మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమయ్యారు వరుణ్ తేజ్. మొదటినుంచి కూడా ఆయన సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. మాస్ హీరో కావడానికి అన్ని లక్షణాలు తనలో ఉన్నప్పటికీ.. అతడు మాత్రం ఆ ఇమేజ్ కి దూరంగా సినిమాలు చేస్తున్నారు. 'కంచె', 'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం' ఇలా అన్నీ ఫ్రెష్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు. మధ్యలో ఒకట్రెండు మాస్ సినిమాలు చేసినా.. ఎక్కువగా డిఫరెంట్ సినిమాలే చేస్తుంటారు.
ఇక త్వరలోనే 'గని', 'ఎఫ్3' లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వరుణ్ తేజ్. వీటి తరువాత వరుణ్ తేజ్ ఎలాంటి సినిమా చేయబోతున్నారనే విషయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈసారి వరుణ్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారట. చాలా మంది హీరోల మాదిరి ఇప్పుడు వరుణ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు.
దానికోసం ఓ కథను కూడా ఎన్నుకున్నాడట. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటు చేసుకున్న బాలాకోట్‌లో భారత ఎయిర్ ఫోర్స్ చేసిన ఎయిర్ స్టైక్స్ గురించి తెలిసిందే. ఈ కాన్సెప్ట్ తో ఓ కొత్త దర్శకుడు కథ రెడీ చేశాడట. వరుణ్ తేజ్ హీరోగా ఓ పేరున్న నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుందని సమాచారం. ఇందులో వరుణ్ కమాండర్ రోల్ లో కనిపిస్తాడట. అతడి కటౌట్ కి ఈ రోల్ పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని.. వరుణ్ ఇమేజ్ ని పెంచేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి!