వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంచుకుని నటించడంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. హీరో, విలన్ మాత్రమే కాదు, క్యారెక్టర్ ఏది ఇచ్చినా అందులో లీనమై నటిస్తాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన అద్భుత చిత్రాల్లో నటించాడు. అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తమిళంలో ‘ఈరమ్’, ‘అరవాన్’, ‘యూటర్న్‌’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తెలుగులో ‘సరైనోడు’ సినిమాలో విలన్ గా, ‘రంగస్థలం’ సినిమాలో హీరో అన్న కుమార్ బాబుగా నటించి మెప్పించారు. ఆది నటనలతోని డిఫరెంట్ యాంగిల్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అటు విలన్ పాత్రలు, ఇటు హీరో పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది పినిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘పార్టనర్’. మనోజ్ దామోదర్ దర్శకత్వంలో ఆర్ ఎఫ్ సి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. హన్సిక మోత్వాని, పల్లక్‌ లల్వాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సైంటిఫిక్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘మరకతమణి’ లాంటి డిఫరెంట్‌ మూవీ తర్వాత మరోసారి డిఫరెంట్‌ కామెడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు దర్శకుడు మనోజ్ దామోదర్.


ఆకట్టుకుంటున్న ‘పార్టనర్’ ట్రైలర్


‘పార్టనర్’ చిత్రం త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేసే యోగిబాబు, తన మిత్రుడు ఆదిని కూడా జాబ్ ఇప్పిస్తానని చెప్పి పట్టణానికి తీసుకెళ్తాడు. అక్కడ ఓ ల్యాబ్ లో ఓ ఫార్ములా దొంగతనం చేస్తే రూ.20 లక్షలు ఇస్తామని ఓ పార్టీ ఆఫర్ ఇస్తుంది. ఆ ఫార్ములా కోసం ల్యాబ్ కు వెళ్లిన యోగిబాబు, ల్యాబ్ లోని పరిశోధకుడితో గొడవపడతారు. అప్పుడు యోగిబాబుకు శరీరంలోకి ఓ మిషన్ ఇంజెక్షన్ వేస్తుంది. ఇంటికి వచ్చి పడుకున్నాక యోగిబాబు అమ్మాయి హన్సికగా మారిపోతాడు. ఆ తర్వాత ఆది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఆయన గర్ల్ ఫ్రెండ్ పల్లక్‌ లల్వాని హన్సికను చూసి ఎలా ఫీలవుతుంది? అనే కొత్త కాన్సెప్ట్ లో రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.



కామెడీ, సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా ‘పార్టనర్’ 


ఇక ‘పార్టనర్’ సినిమా గురించి దర్శకుడు మనోజ్ దామోదర్ కీలక విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు. “ ఇది పూర్తిగా వినోదభరితంగా సాగే కథా చిత్రం. సేమ్ టైమ్ సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన ఫాంటసీ పార్టు కూడా చిత్రంలో ఉంటుంది. ఈ పార్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక హన్సిక పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అబ్బాయిగా ఆమె తన హావభావాలను అద్భుతంగా పలికిస్తుంది. అంతేకాదు, నటుడు ఆది సినీ కెరీర్‌లోనే ముఖ్యమైన చిత్రంగా ‘పార్టనర్‌’ నిలువబోతోంది” అని వివరించారు. ఈ మూవీని తెలుగులోకి కూడా అనువాదం చేయనున్నట్లు సమాచారం.


Read Also: అనూ ఇమ్మాన్యుయేల్‌‌కు, రెబా జాన్‌ ఏమవుతుంది? ‘సామాజవరగమన‘ బ్యూటీ క్లారిటీ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial