Parasite Actor Lee Sun Kyun Found Dead: పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకున్న కొరియన్ మూవీ ‘పారాసైట్’. ఈ మూవీలో నటించిన యాక్టర్ లీ సున్ కున్ చనిపోయారు. 48 ఏళ్ల వయసున్న ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సెంట్రల్ సియోల్ లో ఓ పార్క్ దగ్గర ఉన్న కారులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
డ్రగ్స్ కేసు విచారణ ఎదుర్కొంటున్న లీ
వాస్తవానికి నటుడు లీ సున్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ బార్ ఉద్యోగితో కలిసి ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, తను ఇంటి దగ్గర కూడా చాలా సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు ఓ మహిళ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ నుంచి డ్రగ్ కేసులో విచారణ జరుగుతోంది. ఈ వార్తలను లీ పలుమార్లు తోసిపుచ్చారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించారు. అవసరం అయితే, డ్రగ్స్ పరీక్షలు కూడా చేసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ నిపుణులు ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ అని తేలింది.
గత కొంత కాలంగా డిప్రెషన్ లో లీ
అటు లీ డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలు రావడంతో ఆయన కెరీర్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయన నటిస్తున్న పలు టీవీ షోల నుంచి కూడా తొలగించారు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా ఆయన డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. చేయని తప్పుకు దోషిగా చూస్తున్నారనే అనుమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. పోలీసు విచారణలో అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సౌత్ కొరియాలో డ్రగ్స్ తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. ఎవరైనా విదేశాలకు వెళ్లి డ్రగ్స్ తీసుకుని వచ్చినా, సౌత్ కొరియాకు రాగానే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకే వేళ నేరం రుజువు అయితే, సుమారు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రేమ వివాహం, ఇద్దరు పిల్లలు
నటుడు హీరో లీ కున్ కు వివాహం అయ్యింది. నటి జియోన్ హై జిన్‌ను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2001లో ‘లవర్స్’ అనే టీవీ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి లీ కున్ యాక్టింగ్ కేరీర్‌లో కొనసాగుతున్నారు. ఎన్నో సినిమాలు, టీవీ షోలలో అతడు నటించారు.. 2010 తర్వాత ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఆయన 2019లో నటించిన ‘పారాసైట్’ చిత్రం దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు, ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది. లీ చివరగా ఈ ఏడాది ‘స్లీప్’ అనే సినిమాలో నటించారు.