ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) కి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారం ప్రకటించింది. పెద్దన్న కీర్తి కిరీటంలో, మణిహారంలో మరో గౌరవం చోటు చేసుకుంది. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ నామినేషన్ లభించిన సంతోషంలో ఉన్న కీరవాణి కుటుంబం, అభిమానులు తాజా పద్మ పురస్కారంతో అమితానందంలో ఉన్నారు. 


ప్రముఖ సంగీత కళాకారుడు, తబలా విద్వాంసుడు, నటుడు జాకిర్ హుస్సేన్ (Zakir Hussain) ను పద్మ విభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మహారాష్ట్ర నుంచి ఆయన ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 


ప్రముఖ గాయని వాణీ జయరామ్ (Vani Jayaram) ను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మహారాష్ట్ర నుంచి మరో గాయని సుమన్ కళ్యాన్పూర్ కూడా ఈ పురస్కారం అందుకోనున్నారు. 


ఎంఎం కీరవాణికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మ శ్రీ పురస్కారం లభించింది. నటి, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ (Raveena Tandon) కూడా పద్మ శ్రీ అందుకోనున్నారు. 


కీరవాణికి పద్మశ్రీ పురస్కారం రావడంతో తెలుగు చిత్రసీమలోని పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కీరవాణి - రాజమౌళి ఫ్యామిలీకి వరుస పురస్కారాలు లభిస్తున్నాయి. మొన్న గోల్డెన్ గ్లోబ్, నిన్న ఆస్కార్ నామినేషన్, నేడు పద్మ పురస్కారం... ఎటు చూసినా కీరవాణి పేరు వినబడుతోంది. ఇక పద్మ పురస్కారాల విషయానికి వస్తే... 


కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రస్తుతం మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా... అందులో ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మంది ప్రముఖులను పద్మ భూషన్, మరో 91 మంది ప్రముఖులను పద్మ శ్రీ అవార్డులు వరించాయి.  


Also Read : రాజమౌళికి ఆస్కార్ కంటే పెద్ద అవార్డిచ్చిన సుకుమార్, ఇకపై ఆ స్థానం ఆయనదే


ఓఆర్ఎస్ సృష్టికర్త డాక్టర్ దిలీప్ మహాలనబీస్ ఒక్కరికి పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు. మెడిసిన్ పీడియాట్రిక్స్ విభాగంలో దిలీప్ మహాలనబీస్ కు మరణానంతరం ఈ అత్యున్నత పురస్కారం లభించింది. కలరా, డయేరియా, డీ హైడ్రేషన్ తోనే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ORS ను కనిపెట్టి మహలనోబిస్ 93శాతం మరణాలను తగ్గించారు. పలు రంగాల్లో సేవ చేసిన 25 మంది ప్రముఖులను పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. 


Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో యువ హీరోకి ఛాన్స్ - సిరీస్ నుంచి సినిమాకు


తెలుగు రాష్ట్రాల నుంచి పది మందికి పైగా పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మ భూషణ్ రాగా, ముగ్గురు ప్రముఖులను పద్మ శ్రీ వరించింది. ఆధ్మాత్మికం విభాగంలో చిన్న జీయర్ స్వామి, కమలేష్ డి పటేల్ పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. కీరవాణి కాకుండా ఏపీ నుంచి గణేష్ నాగప్ప క్రిష్ణరాజనగర కు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో, సీవీ రాజు ఆర్ట్, అబ్బారెడ్డికి నాగేశ్వరరావుకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో, కోట సచ్చిదానంద శాస్త్రికి ఆర్ట్ విభాగం, చంద్రశేఖర్ కు సోషల్ వర్క్ విభాగంలో, ప్రకాష్ చంద్ర సూద్ కు విద్య, సాహిత్యం విభాగంలో పద్మ పురస్కారాలు వరించాయి. కాకినాడకు చెందిన సంఘసంస్కర్త, సామాజిక వేత్త సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మశ్రీ వరించింది. తెలంగాణకు చెందిన 80ఏళ్ల చెందిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ వరించింది. కువి, మండా, కుయి అనే గిరిజన తెగల భాషను కాపాడుకునేందుకు ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి చేసిన విశేష కృషికి గానూ పద్మశ్రీ వరించింది.