బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్’తో మళ్లీ ప్రేక్షకుల్లోకి వచ్చారు. మంగళవారం ‘ఆహా’లో ప్రసారమైన షోలో.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ మూవీ టీమ్‌తో ముచ్చటించారు. ఈ షోలో దర్శకుడు అనిల్ రావిపూడితోపాటు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీలా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య కాజల్, శ్రీలీలాను పలు ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత వారితో కొన్ని గేమ్స్ ఆడిస్తూ.. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 


రాగానే జెండా పాతేశావ్: శ్రీలీలకు బాలయ్య పంచ్


శ్రీలీలా స్టేజ్ మీదకు రాగానే బాలయ్య ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘రాగానే జెండా పాతేశావ్. అయితే బాలయ్యతో సినిమా లేదా శ్రీలీలతో తియ్యాలి. లేదా ఇద్దరితో కలిపి సినిమా తియ్యాలి’’ అని అన్నారు. ‘‘ఈ అమ్మాయి అల్లరి పిల్ల.. తెలివైన పిల్ల.. ఇప్పుడిప్పుడే వెళ్లే పిల్ల కాదు. కాజల్ ఎన్నేళ్లు ఉంటుందో అన్నేళ్లు ఉంటుంది. కాజల్‌తోపాటు ఉంటూనే ఉంటుంది’’ అని అన్నారు.


మీ బిడ్డ పాలు తాగకపోతే నా ఫోటో చూపించే ఉంటావుగా?


తాను లేని సమయంలో అనిల్, శ్రీలీలా, కాజల్ రీల్స్ చేయడం తనకు నచ్చలేదని బాలయ్య అన్నారు. మీతో ఒక ఆట ఆడుకుంటా అంటూ.. ‘‘కాజల్ మీ అబ్బాయి నీల్ పాలు తాగకపోయినా, నీళ్లు తాగకపోయినా నా ఫొటో చూపించే ఉంటావుగా.. గబ్బర్ వస్తాడు అన్నట్లుగా’’ అని అన్నారు. దీంతో కాజల్ ‘‘ఈసారి ట్రై చేస్తా’’ అని తెలిపింది. అనంతరం సోషల్ మీడియాలో  ఇప్పటివరకు రిలీజ్ చేయని ఓ ప్రోమోను.. కాజల్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఓ మార్కెట్ సీన్‌లో ఓ మహిళ.. బాలయ్య, కాజల్‌ను భార్యభర్తలని అనుకుంటుంది. దీంతో బాలయ్య ‘‘ఆంటీ ఈమె నా భార్య కాదు’’ అని అంటారు. ఆ తర్వాత కాజల్.. గెడ్డానికి కలర్ వేసుకోవచ్చుగా అని అంటుంది. దీంతో బాలయ్య.. ‘‘నేను రంగులు మార్చను. అందర్, బాహర్ ఏకీ హై (లోపలా బయట ఒకటే)’’ అని అంటారు. ఆ తర్వాత.. ‘‘నువ్వు టాలీవుడ్‌లో అందరితో సినిమాలు చేసేసినట్లున్నావు. మోక్షాజ్ఞతో కూడా చేస్తావా?’’ అని బాలయ్య ప్రశ్నించగానే.. చేస్తానని చెప్పింది కాజల్.


బెస్ట్ డెసిషన్ తీసుకున్నా: శ్రీలీలా


ఆ తర్వాత బాలకృష్ణ శ్రీలీలాను పలు ప్రశ్నలు అడిగారు.. ‘‘శ్రీలీలా, సెట్‌లో గలగలా మాట్లాడతావు. ఇక్కడ ఎందుకు బుద్ధిమంతురాలిగా కూర్చున్నావు’’ అని అడిగారు. ‘‘మీరు కాజల్‌ను అడుగుతున్నారని సైలెంట్‌గా ఉన్నా’’ సమాధానం చెప్పింది. ‘‘ఆంధ్రవాళ్లం కల్పించుకుని పులిహోర కలిపేయాలి’’ అని బాలయ్య అన్నారు. ‘‘మీతో సినిమా అంటే నా భయాలు నాకు ఉండేవి. మిమ్మల్ని కలిశాక ఆ భయాలు పోయాయి అని తెలిపింది. ఆ తర్వాత బాలయ్య ‘భగవాంత్‌కేసరి’ మూవీ గురించి చెబుతూ.. ‘‘ముందు కథ చెప్పినప్పుడు.. నీకు, నాకు ఛాలెంజింగ్ సీన్స్ ఉన్నాయి. కాజల్ సీన్స్ అద్భుతం.. యూత్ నుంచి పండువయస్సు వరకు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు’’ అని తెలిపారు. ‘‘పెళ్లి సందడి విడుదలైన తర్వాత కెరీర్ బిల్డ్ చేసుకొనే టైమ్‌లో ఈ అవకాశం వచ్చింది. కానీ, ఇప్పుడే ఇలాంటివి చెయ్యొచ్చా అని క్వశ్చన్స్ వచ్చిన్నప్పుడు.. ఈ స్క్రిప్ట్ వచ్చింది. నేను బెస్ట్ డెసిషన్ తీసుకున్నా అని అనుకుంటున్నా’’ అని శ్రీలీలా పేర్కొంది. రేపు వేరే సినిమాలు చేయొచ్చు గానీ.. వన్ ఇయర్ తర్వాత ఈ పాత్ర వచ్చినా చెయ్యలేనని తెలిపింది. 


బాలయ్యలో మీకు నచ్చనిది?


షోలో భాగంగా అనిల్ రావిపూడి కొన్ని ప్రశ్నలు అడిగారు. కాజల్, శ్రీలీలల సమాధానాల్లో ఏవైతే మీ హార్ట్‌కు దగ్గరగా ఉంటాయో మీరు వారి వైపుకు వెళ్లాలని అనిల్ చెప్పారు. ఈ సందర్భంగా బాలయ్యలో మీకు నచ్చినది ఏమిటని ఇద్దరినీ అడిగారు అనిల్. ఇందుకు శ్రీలీలా సమాధానమిస్తూ.. ‘‘బాలయ్యది ఓపెన్ హార్ట్. ఏదీ దాచుకోరు’’ అని తెలిపింది. ఆ తర్వాత కాజల్ మాట్లాడుతూ.. ‘‘మీ పేరులో ‘బాలా’కు తగినట్లే చిన్న పిల్లాడి మనస్తత్వం’’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత బాలయ్యలో మీకు నచ్చనది ఏమిటని అనిల్ అడగగానే.. శ్రీలీలా ‘‘సైలెన్స్’’ అని ఠక్కున సమాధానం ఇచ్చింది. దీంతో కాజల్ షాకై.. ఆమె చాలా స్మార్ట్ అంటూ ఆశ్చర్యపోయింది. అయితే, ఆ ప్రశ్నకు మాత్రం కాజల్ సమాధానం చెప్పలేకపోయింది. నేను సైలెంట్‌ అన్నట్లుగా నోరు బిగించింది. అయినా సరే బాలయ్య.. కాజల్ వైపే వెళ్లారు. ఈ ఆటలో ఎవరు విజేతో చెప్పక్కర్లేదని, కాజలే అని అనిల్ అనడంతో శ్రీలీలా అలిగింది. ‘‘కాజల్ నా మనసు గెలిచింది. నువ్వు నా మనసులో ఉన్నావ్’’ అంటూ శ్రీలీలను ఓదార్చారు బాలయ్య. ఆ తర్వాత ముగ్గురు కలిసి హగ్ ఇచ్చుకున్నారు.


అవన్నీ మార్ఫింగ్ వీడియోలు


షోలో ‘భగవంత్‌కేసరీ’ మూవీ షూటింగ్‌ వీడియోలను ప్రదర్శించారు. ఇందులో అనిల్, శ్రీలీలా, కాజల్, బాలయ్య చేసిన ఫన్నీ క్లిప్స్‌ను చూపించారు. ఇది చూసిన తర్వాత బాలయ్య.. ‘‘అవన్నీ మార్ఫింగ్ వీడియోలు. నేను, కాజల్ చాలా డిసిప్లీన్. అనిల్, శ్రీలీలా అల్లరి’’ అని సరదాగా అన్నారు. అనంతరం ‘భగవంత్‌కేసరి’ మూవీలో విలన్‌గా నటించిన అర్జున్ రాంపాల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘‘నాకు తెలుసు ఏం జరుగుతుందో. సినిమా అయినా లైఫ్ అయినా అంతా బాగున్నప్పుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చెయ్యడానికి దిగుతాడు. దాన్ని సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలి’’ అని అన్నారు.


ఏంట్రా నీ బలుపు? అనిల్‌కు షాకిచ్చిన అర్జున్


అర్జున్ రాంపాల్ వచ్చిన తర్వాత బాలయ్య మాట్లాడుతూ.. ‘‘విలన్ వేషాలు వేసేవాళ్లంతా సిక్స్ ప్యాక్స్‌తో తిరుగుతారు. కానీ హీరో కొడితేపడిపోతారు. అదే నాకు ఇష్టం’’ అని అన్నారు. దీంతో అర్జున్ రాంపాల్ అనిల్ వైపు తిరిగి.. ‘‘ఏంట్రా నీ బలుపు.. కిక్ మార్తాహే గిర్ జాతాహై విలన్ (కిక్ కొట్టగానే విలన్ కిందపడిపోతాడా’) అని అన్నాడు. దీంతో అనిల్.. బాలయ్య వైపు తిరిగి.. ‘‘మీరు బాలకృష్ణ కాదు.. ఫిట్టింగ్ కృష్ణుడు’’ అని అన్నారు. బాలకృష్ణ గురించి అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. ‘‘సెట్‌కు రాగానే నేను ఆయన్ని బాలా జీ అన్నాను. దీంతో ఆయన ‘నో బాలా.. కాల్ మీ బ్రో’ అన్నారు. ఆయనతో నటించడం గొప్ప అనుభవం’’ అని అన్నారు. 


Also Read: ఏ దర్శకుడైనా మా నాన్నగారితో సమానం, నీ ప్రశ్నకు నా ఇగో హర్ట్ అయ్యింది: అనిల్‌‌పై అలిగిన బాలయ్య