Best Thriller Movies On OTT: పుస్తకాల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం కామన్. కానీ సినిమాలోనే పుస్తకాన్ని లీడ్‌గా తీసుకొని.. దానిని ఒక థ్రిల్లర్‌గా మార్చి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సినిమాలు చాలా అరుదు. ఇప్పుడు అలాంటి అరుదైన చిత్రాల లిస్ట్‌లో యాడ్ అయ్యింది ‘ది ట్రాన్స్‌లేటర్స్’ (The Translators). ఒరిజినల్‌గా ఫ్రెంచ్ భాషలో విడుదలయిన ఈ సినిమా ‘ది ట్రాన్స్‌లేటర్స్’ అనే పేరుతో ఇంగ్లీష్‌లో కూడా డబ్ అయ్యింది. టైటిల్‌లో ఉన్నట్టుగానే ఇది ఒక ట్రాన్స్‌లేటర్స్ కథ. ఒక పుస్తకానికి సంబంధించిన కథ. ముఖ్యంగా ఈ కథలో ట్విస్ట్‌ను ఊహించడం చాలా కష్టం.


(First on ABP దేశం: వివిధ ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న ఎన్నో ఆసక్తికరమైన.. భిన్నమైన సినిమాలు, సీరిస్‌లను అందరి కంటే ముందు అందించేది ‘ఏబీపీ దేశం’ మాత్రమే. కాపీ కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని పాఠకులకు మనవి.)


కథ..


‘ది ట్రాన్స్‌లేటర్స్’ కథ విషయానికొస్తే.. ఎరిక్ (లాంబర్ట్ విల్సన్) ఒక ఫేమస్ బుక్ పబ్లిషర్. ఇప్పటివరకు తను పబ్లిష్ చేసిన ‘డెడ్లస్’ అనే బుక్ రెండు వాల్యూమ్స్ విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకుంటుంది. దీంతో మూడో వాల్యూమ్ కూడా రాబోతుందని ఒక ఈవెంట్‌లో ప్రకటిస్తాడు. ఈసారి డెడ్లస్ బుక్ కేవలం ఫ్రెంచ్‌లో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలని 9 భాషల నుండి 9 మంది ఫేమస్ బుక్ ట్రాన్స్‌లేటర్స్‌ను పిలిపిస్తాడు. ముందుగా ఆ ట్రాన్స్‌లేటర్స్ అందరినీ ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంచుతాడు ఎరిక్. కానీ వారికి ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం ఏమీ ఇవ్వడు. డెడ్లస్ అనేది చాలా పాపులర్ బుక్ కాబట్టి, దాని మూడో వాల్యూమ్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కాబట్టి దీని గురించి బయట తెలిస్తే తనకు నష్టం వస్తుందని ఎరిక్ చెప్తాడు. దీంతో ట్రాన్స్‌లేటర్స్ కూడా దీనికి ఒప్పుకుంటారు.


ట్రాన్స్‌లేటర్స్ అందరికీ రోజుకు 20 పేజీలు ట్రాన్స్‌లేట్ చేయాలని చెప్తాడు ఎరిక్. అయితే ఆ 20 పేజీలు చదివిన వారంతా ఆ పుస్తకాన్ని రాసింది ఎవరో తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఆ వివరాలు ఏమీ వారికి చెప్పడు ఎరిక్. రోజంతా ట్రాన్స్‌లేట్ చేయడం సాయంత్రం అంతా సరదాగా గడపడం.. అలా అక్కడ ట్రాన్స్‌లేటర్స్ లైఫ్ అంతా సాఫీగా సాగిపోతుంది. మరుసటి రోజు డెడ్లస్ పుస్తకం మూడో వాల్యూమ్‌కు సంబంధించిన కొన్ని పేజీలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయని తనకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ తనకు కావాల్సినంత డబ్బు ఇవ్వకపోతే మిగతా పేజీలు కూడా లీక్ చేస్తామని ఆ మెసేజ్‌లో ఉంటుంది. దీంతో ఎరిక్‌కు ట్రాన్స్‌లేటర్స్‌పై అనుమానం వస్తుంది. అలా వారి రూమ్స్ అన్నింటిని చెక్ చేయిస్తాడు. కానీ ఏ ఆధారం దొరకదు.


అప్పుడే రష్యన్ ట్రాన్స్‌లేటర్ అయిన కేథరిన్ (ఓల్గా)కు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేటర్ అయిన అలెక్స్ (అలెక్స్) మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే వారిలాగా అలెక్స్.. ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్ కాదు. అప్పుడే కేథరిన్‌కు అలెక్స్ తన ఫ్లాష్‌బ్యాక్ చెప్తాడు. డెడ్లస్ రెండు వాల్యూమ్స్‌ను బాగా స్టడీ చేసి మూడో వాల్యూమ్ కథ ఏంటో ముందే గెస్ చేస్తాడు అలెక్స్. అందుకే తనను ప్రత్యేకంగా ట్రాన్స్‌లేటర్‌గా ఎరిక్ అక్కడికి తీసుకొచ్చాడని అలెక్స్ చెప్తాడు. అంతే కానీ తనకు బుక్ లీక్‌కు ఏం సంబంధం లేదంటాడు. మరుసటి రోజు బుక్ లీక్ అయిన విషయం అన్ని పేపర్స్‌లో వస్తుంది. డబ్బు సిద్ధం చేసుకోమని ఎరిక్‌కు మెసేజ్ వస్తుంది. దీంతో ట్రాన్స్‌లేటర్స్ అందరినీ హింసించి, వారిని ఒక చీకటి గదిలో బంధిస్తాడు ఎరిక్. అది తట్టుకోలేక ఒక ట్రాన్స్‌లేటర్ ఆత్మహత్య చేసుకుంటుంది. ఇంతకీ బుక్ లీక్ చేసింది ఎవరు? పుస్తకం రాసింది ఎవరో చివరికైనా తెలుస్తుందా? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.



చివరివరకు సస్పెన్స్..


‘ది ట్రాన్స్‌లేటర్స్’ చూసిన ప్రేక్షకులకు కచ్చితంగా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ చూశామనే ఫీలింగ్ వస్తుంది. చివరివరకు అసలు ఆ పుస్తకాన్ని రాసింది ఎవరు, లీక్ చేసింది ఎవరు అనే సస్పెన్స్‌ను బాగా నడిపించాడు దర్శకుడు రెజిస్ రోయిన్సార్డ్. తొమ్మిది మంది ట్రాన్స్‌లేటర్స్, వారితో పాటు పబ్లిషర్‌గా లాంబర్ట్ విల్సన్.. ఇలా వీరి నటన చుట్టూనే సినిమా తిరుగుతుంది. వీరందరూ మంచి నటనతో తరువాత ఏం జరుగుతుంది అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కల్పించారు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఉన్న ‘ది ట్రాన్స్‌లేటర్స్’ను ట్రై చేయండి.


Also Read: సరిగ్గా 6.15 గంటలకు ఓ వీడియో లింక్ ఓపెన్ చేస్తాడు, భార్యను అలా చూసి భర్త షాక్ - ఈ మూవీలో ట్విస్టులు అదుర్స్