The Third Eye (Mata Batin).. 2017లో విడుదలైన ఇండోనేషియన్ హార్రర్ ఫిల్మ్ ఇది. కథ ఐదేళ్ల వయసు నుంచి, దెయ్యాలను చూసే అబెల్ అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె చుట్టు పక్కల ఎవరికీ ఈ దెయ్యాలు కనపడవు. ఆమె మూడో కన్ను తెరుచుకుని ఉండటం వల్లే ఆమెకు దెయ్యాలను చూడగలుగుతుంది. అసలు థర్డ్ ఐ అంటే ఏమిటీ? ఆ చిన్నారిలో ఉన్న లోపం.. శాపమా? వరమా అనేది కథలోకి వెళ్తేనే తెలుస్తుంది.


మూడో కన్ను(థర్డ్ ఐ) అంటే?


అప్పుడే పుట్టిన పిల్లల్లో నుదిటిపైన పుర్రె పూర్తిగా డెవలప్ కాదని అంటారు. దాన్నే మన పురణాల్లో మూడో కన్ను అని కూడా పిలుస్తారు. పిల్లలు ఎదిగేకొద్ది ఆ కన్ను క్రమేనా పుర్రెలో కలిసిపోతుంది. ఆధ్యాత్మికం కోణంలో చెప్పాలంటే.. మూడో కన్ను అనేది దైవాన్ని దగ్గర చేర్చే మార్గం. దూరదృష్టి, భవిష్యత్తును ముందే తెలుసుకోగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు మూడో కన్ను ఉంటుందని అంటారు. దీని ఆధారంగానే ‘ది థర్డ్ ఐ’ మూవీని రూపొందించారు. 


‘ది థర్డ్ ఐ’ మూవీ కథ ఏమిటంటే..


ఆలియా, అబెల్ అక్కాచెల్లెళ్లు. ఐదేళ్ల అబెల్‌కు మిస్టీరియస్ గా వింత ఆకారాలు, దెయ్యాలు కనపడుతున్నట్టు చెప్తే, తన అక్క ఆలియా నమ్మదు. అదంతా అబెల్ భ్రమ అని అనుకుంటుంది. అబెల్ వాళ్ల అమ్మతో ఈ ఇంట్లో ఉన్న దెయ్యాలు మనల్ని ఇంట్లోనుంచి తరిమేయాలనుకుంటున్నాయి అని చెప్తుంది. దెయ్యాలు చేసే శబ్ధాలు వినపడకుండా అబెల్ ఎప్పుడూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని పడుకుంటుంది. ఒకరోజు అబెల్ పడుకొని ఉన్నపుడు తన గదిలో ఒక భయంకరమైన ఆకారాన్ని ఆలియా చూస్తుంది. అది అబెల్ మీద ఘోరంగా అటాక్ చేస్తుంది. కానీ వారంతా ఎవరో దొంగ ఈ పని చేసాడని అనుకుంటారు.


కొన్ని సంవత్సరాల తర్వాత అబెల్ ఆ ఇంట్లో భయపడుతుండటం వల్ల ఇల్లు మారుతారు. అబెల్ తన పేరెంట్స్ తో ఉంటుంది. ఆలియా ఉద్యోగంలో స్థిరపడి వేరే ఇంట్లో ఉంటుంది. ఒకరోజు తన బోయ్ ఫ్రెండ్ తో బయట ఉన్నపుడు, ఆలియాకు తన పేరెంట్స్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయారని కాల్ వస్తుంది. తన పేరెంట్స్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కంపెనీ ఇచ్చిందని, అది మూడు నెలల్లో ఖాళీ చేయాల్సి ఉంటుందని చెప్పటంతో, వేరే దారి లేక, ఆలియా.. అబెల్ ను తీసుకొని పాత ఇంటికే వెళ్లాల్సి వస్తుంది, ఎక్కడైతే అబెల్ కు దెయ్యాలు కనిపించేవో ఆ ఇంటికి.


ఆ ఇంటికి వెళ్లాక అబెల్ కు మళ్ళీ ఒక భయంకరమైన దెయ్యం కనిపిస్తుంది. ఆలియా అబెల్ ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లాలనుకుంటుంది. ఆ ఇంట్లో కనిపించే దెయ్యాలు ఆ ఇంటి ఓనర్స్. మనల్ని ఈ ఇంట్లోంచి పంపేయాలనుకుంటున్నాయని అబెల్ అంటుంది. అయితే, చిన్నపుడు తననెపుడూ వాళ్లమ్మ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లలేదని, సైకియాట్రిస్ట్ అని అబద్ధం చెప్పి ఒక మంత్రగత్తె దగ్గరికి తీసుకెళ్లేదని, ఆ మంత్రగత్తెకు తనకు జరుగుతున్న విషయాలన్నీ తెలుసని అబెల్ చెప్తుంది.


'బూ విండూ' అనే ఆ మంత్రగత్తె, అబెల్ కు థర్డ్ ఐ తెరుచుకొని ఉండటం వల్ల తను దెయ్యాలు చూడగలుగుతుందని ఆ విషయాలన్నీ ఆలియాకు వివరిస్తుంది. ఈ థర్డ్ ఐ.. ‘‘ఇదంతా నిజమైతే నాకు థర్డ్ ఐ ఓపెన్ చెయ్యి. అప్పుడు నమ్ముతాను. లేదంటే అబెల్‌ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తా’’ అని ఆలియా అంటుంది. అప్పుడు ఆ మంత్రగత్తె నిజంగానే ఆలియాకు థర్డ్ ఐ ఓపెన్ చేస్తుంది. కానీ అప్పుడే ఏమీ తెలియకపోవటంతో ఆలియా ఇదంతా అబద్ధమని వెళ్లిపోతుంది.


ఆ తర్వాత ఆమె హాస్పిటల్లో ఒక పాపతో మాట్లాడుతుంది. కానీ, ఆ పాప ముందే చనిపోయిందని తెలిసి ఆలియా షాక్ అవుతుంది. అప్పటి నుంచి ఆమెకు కూడా దెయ్యాలు కనపడటం మొదలవుతుంది. ఇక కథ అనేక మలుపులు తిరుగుతుంది. అబెల్ కు ముందు థర్డ్ ఐ ఎలా ఓపెన్ అయింది? ఆ దెయ్యాలకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. అలాగే, ఆలియా బోయ్ ఫ్రెండ్ కూడా ఒక ఆత్మ. అతని కథేమిటీ? ఇవన్నీ సినిమాలో చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చేసింది. ఈ మూవీని Netflixలో చూడొచ్చు. 


Also Read: అమ్మాయిలను చంపే సైకో కిల్లర్‌కు ట్రాకర్ పెడితే? ఈ మూవీలో హీరోనే ఎక్కువ భయపెడతాడు