కన్నతల్లి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పిల్లల ప్రాణాల కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు ఏ మాత్రం వెనకాడదు. మరి, అలాంటి తల్లి.. కన్న బిడ్డలనే కడతేర్చితే? అంతకు మించిన క్రూరత్వం మరొకటి ఉండదు కదూ. The Curse Of La Llorona మూవీ నేపథ్యం కూడా అదే. ఓ తల్లి తన బిడ్డలను చంపేస్తుంది. ఆ తర్వాత ఆమె దెయ్యంలా మారి.. ఎంతో మంది చిన్నారులను బలి తీసుకుంటుంది. ఇంతకీ ఎవరు ఆమె? తన బిడ్డలను ఎందుకు చంపేస్తుందో తెలుసుకోవాలంటే.. ఈ మూవీని చూడాల్సిందే.


ఇదీ కథ..


ఈ మూవీ 2019లో హాలీవుడ్‌లో విడుదలైంది. 1673వ సంవత్సరం నాటి సీన్‌తో మూవీ మొదలవుతుంది. మెక్సికోలో ఒక అందమైన కుటుంబాన్ని చూపిస్తారు. భార్యాభర్తలు వారి ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు. ఒకరోజు ఆ ఇద్దరు పిల్లలు దాగుడు మూతలు ఆడుతుంటారు. వారిలో ఒక పిల్లాడు కళ్లు మూసుకుంటాడు. కళ్లు తెరిచి చూసేసరికి తన తల్లి, తమ్ముడు కనిపించరు. దీంతో వారిని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా నదీ తీరంలో తల్లి, తమ్ముడిని చూస్తాడు. తల్లి కిరాతకాన్ని చూసి షాకవుతాడు. ఆమె తన కొడుకును నీటిలో ముంచి చంపుతుంది. అది చూసిన పెద్ద కొడుకు భయంతో పరుగులు పెడతాడు. అయినా ఫలితం ఉండదు. తన తల్లి చేతికి చిక్కుతాడు. 


సీన్ కట్ చేస్తే.. అది 1973. లాస్ ఏంజెల్స్ ఆనా అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో నివసిస్తూ ఉంటుంది. ఆమె భర్త పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి చనిపోయాడు. ఆమె ఒక సోషల్ సర్వీస్ వర్క్ చేస్తుంటుంది. పేరెంట్స్ వారి పిల్లల్ని బాగా చూసుకుంటున్నారో లేదో తెలుసుకోవడమే ఆమె పని. ఆనా చాలారోజుల నుంచి పాట్రీషియా అనే మహిళ కేసును పర్యవేక్షిస్తుంటుంది. తన బాస్ ఆ కేసు విషయమై మాట్లాడుతూ నీకు ఇప్పటికే చాలా బాధ్యతలున్నాయి. ఈ కేసును వేరే వాళ్లకు అప్పగిస్తానంటాడు. పాట్రీషియా నాకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి నాకంటే బాగా ఈ కేసును ఎవరూ విచారించలేరు. నేనే చూస్తానంటుంది ఆనా. ఆ రోజు రాత్రి విచారణ కోసం పాట్రీషియా ఇంటికి బాస్ చెప్పింట్టుగా వెంట పోలీస్ ఆఫీసర్ ను తీసుకొని వెళ్తుంది. పాట్రీషియా వారిని లోపలికి రానీయదు. నేనొక్కదాన్నే వస్తానని ఆనా చెప్పగా లోపలికి రానిస్తుంది. పాట్రీషియా భయంగా కనిపిస్తుంది.


ఆమె పిల్లలెక్కడున్నారని ఆనా వెతుకుతుంటుంది. ఒక డోర్ మీద ఏవేవో బొమ్మలుంటాయి. అటువైపు వెళ్తున్నందుకు పాట్రీషియా ఆనా మీద అటాక్ చేస్తుంది. సమయానికి పోలీస్ ఆఫీసర్ వచ్చి కాపాడుతాడు. ఆనా ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ గదిలో ఇద్దరు పిల్లలు భయం భయంగా ఏదో చెప్తారు. వారు చెప్పేదేదీ ఆనాకు అర్థం కాదు. ఆ పిల్లలు లా ల్లొరోనా చంపేస్తుందని అంటూ ఉంటారు. అయినా పట్టించుకోకుండా వాళ్లను చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్లో ఉంచుతుంది.


వాళ్ల చేతి మీద కాల్చిన వాతలు ఉంటాయి. అలా ఎవరు చేశారని ఆనా అడుగుతుంది. లా ల్లోరోనానే ఇలా చేసిందని వారు చెప్తారు. ఆ రోజు రాత్రి.. ఆ పిల్లలను లా ల్లోరోనా ఎత్తుకుపోతుంది. తర్వాతి రోజు ఆ పిల్లలు ఇద్దరు ఓ నదిలో శవాలై తేలుతారు. ఈ విషయం తెలియగానే ఆనా తన పిల్లలతో సహా ఘటనా స్థలానికి చేరుతుంది. అక్కడికి చనిపోయిన పిల్లల తల్లి పాట్రీషియా కూడా వస్తుంది. ‘‘నువ్వే నా బిడ్డలను చంపేసావు’’ అని ఆనాపై అరుస్తుంది. ఇంకా ఒక్కరోజైతే ఆమె నుంచి విముక్తి పొందేవారు అని అంటుంది. ఆమె ఎవరు? అని ఆనా అడిగితే. "లా ల్లోరోనా" అని చెప్తుంది పాట్రీషియా. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ దెయ్యం.. ఆనా పిల్లలను కూడా వెంటాడుతుంది. అక్కడి నుంచి ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటుంది. మీరు ఎప్పుడూ చూడని ఒక సరికొత్త హర్రర్ మూవీ చూసిన ఫీల్ కలుగుతుంది. స్పాయిలర్స్ వల్ల ఫీల్ మిస్ అవుతారు. కాబట్టి.. NETFLIXలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఈ రోజే చూసేయండి.