RK Sagar's The 100 Movie OTT Streaming On Amazon Prime Video: 'మొగలిరేకులు' సీరియల్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడిగా బుల్లితెర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు ఆర్కే సాగర్. ఆయన నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'ది 100'. రిలీజ్‌కు ముందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీ ప్రమోషన్స్‌కు హాజరు కాగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. జులై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకోగా... తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ సడన్‌గా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి వచ్చేసింది. దీంతో పాటు 'లయన్స్ గేట్ ప్లే' ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 'మా చిత్రం 'ది 100' ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో ప్రసారం అవుతుంది. ఇది కేవలం ఓ నెంబర్ మాత్రమే కాదు. ఓ వెపన్. ధైర్యం, త్యాగం, ఉత్కంఠబరితమైన స్టోరీని చూడండి.' అంటూ పేర్కొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
Also Read: సైకిల్‌పై ఆదోని To హైదరాబాద్ - లేడీ ఫ్యాన్ అభిమానానికి ఫిదా... మా మంచి మెగాస్టార్ ఏం చేశారంటే?
ఈ మూవీకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించగా... ఆర్కే సాగర్ జోడీగా మిషా నారంగ్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే ధన్య బాలకృష్ణ, వీవీ గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్, జయంత్, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప, టెంపర్ వంశీ, వంశీ నెక్కంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించగా... రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడిగా బుల్లితెర ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసిన ఆర్కే సాగర్... ఈ మూవీలోనూ ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్‌గా అదరగొట్టారు. కథ విషయానికొస్తే... నగరంలో ఓ ముఠా చేస్తోన్న దోపిడీలు, వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. అప్పుడే తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో జాయిన్ అవుతాడు విక్రాంత్ (ఆర్కే సాగర్). ఒడిశాకు చెందిన ఓ ముఠా దీని వెనుక ఉందని తెలుసుకున్న విక్రాంత్... పక్కా ప్రణాళికతో నిందితులను పట్టుకుంటాడు. అయితే, తాను ప్రేమించిన ఆర్తి (మిషా నారంగ్) కూడా ఈ ముఠా బాధితురాలే అని తెలుసుకుంటాడు.
ఈ క్రమంలో ఈ కేసులో మరో కోణం బయటపడుతుంది. అసలు ఈ కేసుకు ఆర్తికి సంబంధం ఏంటి? కేసులో బయటపడ్డ ఆ మరో కోణం ఏంటి? ఆర్తిని ఎవరు ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి ఆర్తిని విక్రాంత్ కాపాడాడా? అనేది తెలియాలంటే మూవీ ఇప్పుడే చూసెయ్యండి.