Nithiin's Thammudu Movie OTT Release Date: యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'తమ్ముడు' బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.40 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కలెక్షన్లలో తేలిపోయింది. ఈ నెల 4న రిలీజ్ కాగా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
స్ట్రీమింగ్ డేట్ అదేనా...
ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' మంచి ధరకు దక్కించుకుంది. ఆగస్ట్ 1 నుంచి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.
బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్‌తో ఈ మూవీని 'వకీల్ సాబ్' ఫేం వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. నితిన్ సరసన వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ హీరోయిన్లుగా నటించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు స్వాసిక, సౌరభ్ సచ్ దేవ్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సినిమాను నిర్మించారు.
Also Read: చిరంజీవి అనిల్ రావిపూడి మూవీపై బిగ్ అప్డేట్! - ఫస్ట్ టైం నయనతారతో చిరు రొమాంటిక్ సాంగ్?
స్టోరీ ఏంటంటే?
జై (నితిన్) ఓ ఆర్చరీ ప్లేయర్. దేశం తరఫున ఆడి ఎన్నో పతకాలు సాధిస్తాడు. తనకంటూ ఓ లక్ష్యం ఏర్పరుచుకుంటాడు. అయితే, దాన్ని సాధించే క్రమంలో ఎన్నో గత జ్ఞాపకాలు వెంటాడుతాయి. చిన్నప్పుడు తన అక్క విషయంలో తాను చేసిన ఓ తప్పు అతనికి ఆవేదన కలిగిస్తుంది. కొన్ని ఘటనలతో తన కుటుంబానికి దూరమవుతుంది ఝాన్సీ (లయ). తన మాట ప్రకారం తండ్రి చనిపోయినా ఇంటి ముఖం చూడదు. దీంతో తన అక్కను ఎలాగైనా కలవాలని... కుటుంబానికి దగ్గర చేయాలనుకుంటాడు జై.
ఇదే టైంలో విశాఖలో ఒక భారీ అగ్నిప్రమాదం జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. అందుకు కారణమైన అజర్వాల్ (సౌరభ్ సచ్ దేవ్) తప్పును కప్పి పుచ్చుకునేందుకు సీఎంకు భారీగా లంచం ఇస్తాడు. అయితే, సిన్సియర్ ఆఫీసర్ ఝాన్సీ (లయ) అజర్వాల్‌కు తలనొప్పిలా మారుతుంది. దీంతో ఆమెను చంపాలని ప్లాన్ చేస్తాడు. ఝాన్సీ కుటుంబంతో కలిసి అంబరగొడుగు అమ్మవారి జాతరకు వెళ్లగా అక్కడ జై ఆమెను ఈ ముఠా నుంచి రక్షించేందుకు చూస్తాడు. తన తమ్ముడు జైకి ఝాన్సీ దగ్గరయ్యిందా?, అజర్వాల్ ప్లాన్‌లను జై ఎలా తిప్పికొట్టాడు? చివరకు జై తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిదే.
నితిన్ ఖాతాలో 'భీష్మ' తర్వాత సరైన హిట్ పడలేదు. లాస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' అనుకున్నంత సక్సెస్ కాలేదు. 'తమ్ముడు'తో మళ్లీ కమ్ బ్యాక్ కావాలని యత్నించినా నిరాశే మిగిలింది. ఇక ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
నెట్ ఫ్లిక్స్ భారీ మూవీస్
'నెట్ ఫ్లిక్స్' ఓటీటీ మరో రెండు భారీ మూవీస్ డిజిటల్ రైట్స్ కూడా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' రూ.50 కోట్లకు, మాస్ మహారాజ రవితేజ నటించిన 'మాస్ జాతర' మూవీని రూ.20 కోట్లకు సొంతం చేసుకుంది.