Nayanthara's Test Movie OTT Streaming On Netflix: నయనతార (Nayanthara), మాధవన్, సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ 'టెస్ట్' (Test) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినా తాజాగా అందుబాటులోకి వచ్చింది.
నేరుగా ఓటీటీలోకి..
2024 లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలో డైరెక్ట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మూవీకి ఎన్.శశికాంత్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా మారారు. ఓ వైపు డైరెక్షన్ చేస్తూనే మరోవైపు చక్రవర్తి రామచంద్రంతో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. ఆయన రచయితగానూ వ్యవహరించారు. సినిమాలో నయనతార, సిద్దార్ద్, మాధవన్‌లతో పాటు మీరా జాస్మిన్, నాజర్ కూడా కీలక పాత్ర పోషించారు.
స్టోరీ ఏంటంటే?
స్పోర్ట్స్ ప్రధానాంశంగా ఓ ముగ్గురి జీవితాల చుట్టూ ఈ 'టెస్ట్' మూవీ కథ సాగుతుంది. కుముద (నయనతార), శరవణన్ (మాధవన్) భార్యాభర్తలు కాగా అర్జున్ (సిద్దార్ద్) కుముద స్నేహితుడు. కుముద ఓ స్కూల్ టీచర్‌గా పని చేస్తుండగా.. తను తల్లి కావాలని కోరుకుంటుంది. శరవణన్ ఓ ప్రాజెక్ట్ తయారు చేసి దేశంలోనే బెస్ట్ సైంటిస్ట్ కావాలని కలలు కంటాడు. ఇదే సమయంలో ఫ్యామిలీ బాధ్యతలతో నలిగిపోతుండగా.. తన ప్రాజెక్టు పూర్తి చేసేందుకు డబ్బు కావాల్సి ఉంటుంది. మరోవైపు.. కుముద స్కూల్ మేట్ అర్జున్ ఓ క్రికెటర్. భారతదేశం తరఫున పలు మ్యాచ్‌లు ఆడతాడు. అయితే, అతను ఫామ్‌లో లేకపోవడంతో సెలక్టర్స్ అతన్ని జట్టు నుంచి తొలగించాలని భావిస్తారు.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో తన సత్తా చాటాలని అర్జున్ భావిస్తాడు. ఇలా ఒక్కొక్కరు తమ కలలు కంటుండగా.. వీళ్ల లైఫ్‌లోకి బెట్టింగ్ సిండికేట్ ఎంట్రీ ఇస్తుంది. ఆ బెట్టింగ్, జరగబోయే ఇంటర్నేషనల్ మ్యాచ్‌పైనే వీరి ముగ్గురి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే, బెట్టింగ్ వ్యవహారంపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతారు అధికారులు. అసలు శరవణన్ సైంటిస్ట్ కావాలనే కోరిక నెరవేరిందా?, తాను అనుకున్నట్లుగానే అర్జున్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడా?, కుముద ఓ టీచర్‌గా ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తూనే.. తాను అనుకున్నది సాధించిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నయనతార ప్రస్తుతం 'మూకుత్తి అమ్మన్ 2'లో నటిస్తున్నారు. కన్నడలో టాక్సిక్, మలయాళంలో డియర్ స్టూడెంట్, తమిళంలో మన్నంగ్‌కట్టి, రక్కై సినిమాల్లోనూ నటిస్తున్నారు.