Latest Web Series Streaming On August 2025: ఆగస్ట్ నెల మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందనుంది. ఓ వైపు థియేటర్స్‌లో కొత్త మూవీస్ సందడి చేయనుండగా... వెబ్ సిరీస్‌లు సైతం అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఆ ఇంట్రెస్ట్ వెబ్ సిరీస్ ఏంటో ఓసారి చూస్తే...

పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ'

ఇద్దరు ప్రాణ స్నేహితులు రాజకీయ బద్ధ శత్రువులుగా ఎలా మారారు? రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎలా చెరగని ముద్ర వేశారు? అనే కథాంశంతో రూపొందింన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మయసభ'. చంద్రబాబు, వైఎస్సార్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

ఈ సిరీస్‌కు దేవా కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించగా... సీబీఎన్ పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్సార్ పాత్రలో చైతన్య రావు కనిపించనున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.

లవ్, ఎమోషన్... 'అరేబియా కడలి'

సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'అరేబియా కడలి'. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ నెల 8 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు సూర్య కుమార్ దర్శకత్వం వహించగా... స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రచయిత, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మించారు. సత్యదేవ్, ఆనందితో పాటు రఘుబాబు, నాజర్, పూనమ్ బజ్వా, దలీప్ తాహిల్, హర్ష రోషన్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు.

ఇటీవల రిలీజ్ సంచలన విజయం సాధించిన నాగచైతన్య 'తండేల్' మూవీ వంటి కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లి పాక్ జలాల్లో పొరపాటున ప్రవేశించిన ఏపీ మత్స్యకారుల స్టోరీ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు.

Also Read: 'సన్నాఫ్ సర్దార్ 2' రివ్యూ: రాజమౌళి 'మర్యాద రామన్న'కు సీక్వెలా? మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ హిందీ సినిమా ఎలా ఉందంటే?

రొమాంటిక్ కామెడీ సిరీస్ 'రాంబో ఇన్ లవ్'

అభినవ్ మణికంఠ, పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'రాంబో ఇన్ లవ్'. ఈ సిరీస్‌కు అజిత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష

కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వస్తోన్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో పాటు సామాన్యులు కూడా ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే దాదాపు 200 మంది నుంచి 40 మందిని స్క్రూటినీ చేశారు. వీరికి 'అగ్ని పరీక్ష' అంటూ కొన్ని స్పెషల్ టాస్క్‌లు పెట్టబోతున్నారు నిర్వాహకులు. ఈ టాస్కుల్ని ఆడియెన్స్‌కు చూపించేలా ప్లాన్ చేస్తున్నారు.

వీటిని 'స్టార్ మా' ఛానల్‌లో ప్రీమియర్ చేస్తారనే ప్రచారం సాగినా... బిగ్ బాస్ 'అగ్ని పరీక్ష' కేవలం 'జియో హాట్ స్టార్' ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. సామాన్యులకు ఎలాంటి టాస్కులు ఇచ్చారు?, వారిని ఎలా సెలక్ట్ చేశారు? అనేది ఇందులో చూపించనున్నారు.

ఇంగ్లీష్ సిరీస్‌లు కూడా...

దీంతో పాటే 'Platonic season 2' టీవీ షో 'యాపిల్ టీవీ ప్లస్'లో ఆగస్ట్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే, 'Invasion season 3' ఈ నెల 22 నుంచి ఇదే ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.