చంటి బిడ్డ వినే తొలి గొంతు, తొలి పాట 'అమ్మ'దే అవుతుంది. లాలించి, పాడించి పిల్లల్ని నిద్రపుచ్చే అమ్మలను ప్రతి రోజూ చూస్తుంటాం. ఓ అమ్మ చంటి బిడ్డతో పాటల పోటీలకు వచ్చింది. పది వేల మంది ఆడిషన్స్ ఇస్తే... అందులో ఈ అమ్మ ఉంది. వాళ్ళను దాటుకుని తుది ఫైనలిస్టుల జాబితాలో చోటు సంపాదించింది. ఈ రోజు తుది సమయంలో విజేతగా నిలిచింది. ఆ అమ్మే 'సౌజన్యా భాగవతుల'.
అల్లు అర్జున్ చేతుల మీదుగా కిరీటాన్ని అందుకున్న సౌజన్య భాగవతుల
తెలుగు ప్రజల హృదయాల్లో తమకు ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్ అందిస్తూ దూసుకు వెళుతున్న ఓటీటీ వేదిక 'ఆహా'. అందులో విజయవంతమైన కార్యక్రమాల్లో 'తెలుగు ఇండియన్ ఐడల్' ఒకటి. ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ సీజన్ అంతకు మించి వినోదాన్ని అందించింది. 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' నేటితో ముగిసింది. ఈ సంగీత మహోత్సవం చివరి మజిలీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సందడి చేశారు. ఫినాలేకి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.
పది వేల మందికి పైగా ఆడిషన్స్‌లో పోటీ పడగా... అందులో నుంచి 12 మంది టైటిల్ కోసం పోటీ పడ్డారు. చివరకు... న్యూ జెర్సీ నుంచి శ్రుతి, ఇద్దరు హైదరాబాద్ కుర్రాళ్లు జయరామ్, కార్తీక్, సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ, విశాఖపట్నం నుంచి సౌజన్య భాగవతుల ఫినాలేలోకి అడుగు పెట్టారు. ఎంతో ఉత్కంఠగా 'నువ్వా నేనా' అనేంతలా పోటా పోటీగా ఫినాలే జరిగింది. ఇందులో విశాఖపట్నానికి చెందిన సౌజన్య భాగవతుల (Soujanya Bhagavatula) విజేతగా నిలిచారు. అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆమెకు కిరీటాన్ని అందజేశారు.
'తెలుగు ఇండియన్ ఐడల్ 2' తుది మజిలీలో సౌజన్య భాగవతుల తొలి స్థానంలో నిలువగా... ఆ తర్వాతి స్థానంలో జయరామ్ (ఫస్ట్ రన్నరప్), మూడో స్థానంలో లాస్య ప్రియ (సెకండ్ రన్నరప్)లుగా నిలిచారు.
రెండేళ్ల చిన్నారితో ఫినాలేకు వచ్చిన సౌజన్య
సౌజన్య భాగవతుల శ్రావ్యమైన గాత్రం గురించి కొత్తగా చెప్పేది ఏముంది? ఆహా 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' కిరీటమే ఆమె సొంతమైంది. సౌజన్య పాటలతో పాటు ముఖ్య అతిథి అల్లు అర్జున్ సహా షో చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఆకర్షించిన మరో విషయం... మాతృత్వం! రెండు నెలల్లో సౌజన్య కుమార్తెకు రెండేళ్లు నిండుతాయి. సౌజన్యకు మద్దతుగాకుమార్తెతో పాటు భర్త షోకి వచ్చారు.
Also Read : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?
సాధారణంగా పెళ్ళైన తర్వాత కొంత మంది మహిళలు తమ కెరీర్ ముగిసిందని భావిస్తారు. వివాహమైన తర్వాత, పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా పట్టుదలతో కృషి చేస్తే సాధించలేదని ఏదీ లేదని 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' విజేతగా నిలవడం ద్వారా సౌజన్య భాగవతుల చాటి చెప్పారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. ఓ అమ్మకు కిరీటం అందించడం ద్వారా 'ఆహా' సైతం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
'తెలుగు ఇండియన్ ఐడల్ 2' షోకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, గాయనీ గాయకులు గీతా మాధురి, కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మరో సింగర్ హేమచంద్ర హోస్ట్‌గా వ్యవహరించారు.
Also Read : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్