Best Horror Movies On OTT: సైన్స్ ఫిక్షన్ కథల్లో హారర్ ఎలిమెంట్స్ ఉండడం చాలా అరుదైన కాంబినేషన్. అలాంటి కాంబినేషన్‌లోని సినిమాలు కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా ఉంటాయి. కానీ ఈ కాంబినేషన్‌లో సినిమాలు తెరకెక్కించినవారు చాలా తక్కువ. అందులో జపానీస్ భాషలోని ‘ట్యాగ్’ (Tag) చిత్రం కూడా ఒకటి. 2015లో విడుదలయిన ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ ప్లస్ హారర్ జోనర్‌కు సూట్ అయ్యే సినిమా. ఆ రెండు జోనర్లను ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.
(First on ABP దేశం: వివిధ ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న ఎన్నో ఆసక్తికరమైన.. భిన్నమైన సినిమాలు, సీరిస్‌లను అందరి కంటే ముందు అందించేది ‘ఏబీపీ దేశం’ మాత్రమే. కాపీ కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని పాఠకులకు మనవి.)
కథ..
‘ట్యాగ్’ కథ విషయానికొస్తే.. ఓపెన్ చేయగానే రెండు బస్సుల్లో కొందరు స్టూడెంట్స్.. ఒక ప్రాంతానికి వెళ్తుంటారు. వారంతా చాలా సరదాగా ఉండగా మిట్సుకా (రేనా ట్రిండెల్) డైరీ రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్.. తన చేతిలో నుంచి పెన్ లాక్కొని కింద పడేస్తుంది. ఆ పెన్‌ను తీసుకోవడానికి మిట్సుకా కిందకు ఒంగుతుంది. కానీ తను లేచి చూసేలోపే ఆ రెండు బస్సులు, అందులో ఉన్న స్టూడెంట్స్ అంతా సగానికి కట్ అయిపోయి ఉంటారు. అసలు మిట్సుకాకు ఏమీ అర్థం కాదు. దీంతో బస్ దిగి పారిపోతూ ఉంటుంది. తనను ఒక గాలి వెంటాడుతుంది. ఆ గాలి తాకిన ప్రతీ ఒక్కరు సగంలో కట్ అయిపోయి ఉంటారు. వారి నుంచి తప్పించుకొని ఒక స్కూల్‌కు వెళ్తుంది మిట్సుకా. అక్కడ తన ఫ్రెండ్స్ అంటూ కొందరు అమ్మాయిలు కలుస్తారు. కానీ వారెవరినీ మిట్సుకాను గుర్తుపట్టలేరు.
గాలిని చూసి మిట్సుకా భయపడుతుంటే తన ఫ్రెండ్ ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత వారంతా కలిసి టీచర్ చెప్తున్నా వినకుండా స్కూల్ బంక్ కొట్టి బయటికి వెళ్తారు. కాసేపటి తర్వాత తిరిగొస్తారు. అప్పుడే ఆ స్కూల్‌లోని టీచర్స్ అంతా గన్స్ తీసుకొని స్టూడెంట్స్‌ను చంపడానికి వెంటాడతారు. అందులో మిట్సుకా మాత్రమే తప్పించుకొని బయటపడుతుంది. ఒక పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. అక్కడ అద్దంలో తన రూపం చూసుకుంటే తనకు తానే డిఫరెంట్‌గా కనిపిస్తుంది మిట్సుకా. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్.. మిట్సుకా పెళ్లి అంటూ ఒక చర్చి దగ్గరకు తీసుకెళ్తుంది. అక్కడ తన పెళ్లికూతురిగా రెడీ అయ్యి వెళ్లిన తర్వాత పెళ్లికొడుకు స్థానంలో ఒక బాక్స్‌లో నుంచి ఒక పందిని బయటికి తీసుకొస్తారు. దీంతో భయపడిన మిట్సుకా.. అక్కడ ఉన్న అందరినీ చంపి పారిపోతుంది.
పెళ్లికూతురు డ్రెస్‌లో పారిపోయి వచ్చిన మిట్సుకా.. సడెన్‌గా అద్దంలోకి చూస్తే వేరే డ్రెస్‌లో ఉంటుంది. అప్పుడే తన చుట్టూ కొంతమంది చేరి తను మంచి రన్నర్ అని రేస్ కోసం తనను సిద్ధం చేస్తారు. మిట్సుకా కూడా రేసులో బాగా పరిగెడుతుంది. అదే సమయంలో ఇంతకు ముందు తను ఫ్రెండ్స్ అనుకున్నవారంతా తనకు కనిపించడం మొదలవుతుంది. అదే సమయంలో తను ఒక చీకటి ప్రాంతంలోకి వెళ్తుంది. అక్కడ తనకు ఒక దారి కనిపిస్తుంది. అందులోకి వెళ్లగానే తను భవిష్యత్తులోకి వెళ్తుంది. దీంతో కళ్లు మూసుకొని ఆలోచించగానే అసలు తనకు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. ఇంతకీ మిట్సుకాకు ఏమైంది? ఎందుకిలా తన రూపాలు మారుతున్నాయి? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.
రక్తపాతం..
‘ట్యాగ్’లో హారర్ సీన్స్ చాలానే ఉంటాయి. కొన్ని సీన్స్‌లో రక్తపాతం చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ చివరివరకు అసలు హీరోయిన్‌కు ఏమైంది? ఏం జరుగుతుంది అని అస్సలు రివీల్ చేయకుండా కథను ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు దర్శకుడు సియోన్ సోనో. రక్తపాతం ఎక్కువగా ఉన్న ఒక మంచి హారర్ మూవీని చూడాలనుకునేవారు యూట్యూబ్‌లో ఉన్న ‘ట్యాగ్’ను చూసేయొచ్చు. Tag 2015 అని సెర్చ్ చెయ్యండి.