హీరోయిన్లు సినిమాలు ప్రొడ్యూస్ చేయడం అరుదు. ఇండస్ట్రీలోకి వచ్చామా? నాలుగు రాళ్లు వెనకేసుకున్నామా? లైఫ్‌లో సెటిల్ అయ్యామా? అనుకునే అందాల భామలు ఎక్కువ మంది మనకు కనిపిస్తారు. అయితే హీరోయిన్ అయ్యాక సంపాదించిన డబ్బులతో సినిమాలు తీసే అందాల భామలు తక్కువ. వారిలో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఒకరు. ఆవిడ 'శుభం' సినిమా ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. అది ఈ నెలలో ఓటీటీ విడుదలకు రెడీ అయింది.
జూన్ 13 నుంచి జియో హాట్ స్టార్‌లో
Samantha's Shubham OTT Platform and Release Date: శుభం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. జూన్ 13వ తేదీ నుంచి తమ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది.
'శుభం' సినిమాలో హర్షిత్ రెడ్డి - శ్రియ కొంతం ఒక జంటగా నటించగా... శ్రీనివాస్ గవిరెడ్డి - శ్రావణి లక్ష్మి మరొక జంటగా... చరణ్ పెరి - శాలిని కొండేపూడి ఇంకో జంటగా నటించారు. వంశీధర్ గౌడ్ ఒక కీలక పాత్ర చేశారు. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.
హారర్ కామెడీగా 'శుభం' తెరకెక్కింది. ఇప్పటి వరకు టాలీవుడ్ ఆడియన్స్ చాలా హారర్ కామెడీలు చూశారు. అయితే వాటన్నిటికీ భిన్నమైన కథతో ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమా తీశారు. సీరియల్స్ పిచ్చి ఉన్న దెయ్యాలు ఇంట్లో ఆడవాళ్లకు ఆవహిస్తాయి. అప్పటి వరకు ఎంతో గౌరవం ఇచ్చిన భార్యలు, తమలో ఆత్మ ప్రవేశించిన తర్వాత భర్తలను చితక్కొట్టుడు కొడతారు భార్యలు. అసలు దెయ్యాలకు సీరియల్స్ పిచ్చి ఏమిటి? ఆత్మలుగా మళ్లీ ఎందుకు వచ్చారు? చివరకు ఎలా వెళ్ళిపోయారు? అనేది సినిమా చూస్తే తెలుసుకోవాలి.