Sourav Ganguly Is Expected To Star In Khakee 2 Web Series: ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఓ వెబ్ సిరీస్ ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పోలీస్ యూనిఫాం వేసుకుని ఉన్న ఓ పిక్ బయటకు రాగా.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని ఫ్యాన్స్ ఫోటో షేర్ చేస్తున్నారు. త్వరలోనే ఆయన్ను తెరపై చూడొచ్చంటూ సంబర పడుతున్నారు. నీరజ్ పాండే (Neeraj Pandey) దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' (Khakee: The Bengal Chapter - Khakee 2) ఈ నెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో జీత్ మద్నాని, ప్రోసేన్ జీత్ ఛటర్జీ, శాశ్వతా ఛటర్జీ, పరంబ్రత ఛటర్జీ వంటి వాళ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుండగా.. దీనిపై నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ వార్తలు బలం చేకూర్చాయి
మరోవైపు, బుధవారం ఈ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంచ్‌లో నీరజ్ పాండే చేసిన కామెంట్స్ కూడా ఈ వార్తలకు బలన్నిస్తున్నాయి. 'ఈ సిరీస్‌లో గంగూలీ ఉన్నారా.?' అనే ప్రశ్నకు స్పందించిన ఆయన.. 'సౌరభ్ విషయానికొస్తే చెప్పడం ఎందుకు.?.. చూస్తూ ఉండండి.' అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. దీంతో సౌరభ్ గంగూలీ సిరీస్‌లో నటిస్తున్నారని.. ప్రచారంలో భాగంగానే ఆయన యూనిఫాం ధరించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 2000 సంవత్సరంలో బెంగాల్‌లో జరిగిన పరిస్థితులను చూపిస్తూ ఈ సిరీస్ రూపొందింది. పొలిటీషియన్స్ అండతో గ్యాంగ్ స్టర్స్ రెచ్చిపోగా నగరంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అధికారులు ఎలా శ్రమించారు.?, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? గందరగోళ పరిస్థితుల్లో ఐపీఎస్ అధికారి అర్జున్ మైత్రా చట్టాన్ని ఎలా కాపాడారు.?, ఈ ప్రయత్నంలో ఆయనకు ఎదురైన సవాళ్లు వంటివి ప్రధానాంశాలుగా ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది.
Also Read: రెండు ఓటీటీల్లోకి కమెడియన్ ధన్‌రాజ్ 'రామం రాఘవం' మూవీ - ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా.?
ఈ సిరీస్ సీజన్ 1 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' 2022, నవంబర్ 25న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై ఓటీటీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఆయన రచించిన 'Bihar Diaries' బుక్ ఆధారంగా సిరీస్ తీశారు. దీనికి కొనసాగింపుగా సీజన్ 2 రూపొందించారు.
గంగూలీ బయోపిక్‌లో..
మరోవైపు, త్వరలోనే గంగూలీ బయోపిక్ వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం కొద్ది రోజులుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. తన బయోపిక్‌లో నటించే హీరోపై స్వయంగా గంగూలీనే ఓ ఈవెంట్‌లో స్పందించారు. 'నేను విన్నంతవరకూ.. టైటిల్ రోల్‌లో రాజ్ కుమార్ రావ్ (Raj Kumar Rav) నటించనున్నారు. అయితే డేట్స్ సర్దుబాటులో కొంత సమస్య ఉంది. అందువల్ల సినిమా రిలీజ్ అయ్యేందుకు మరో ఏడాదిపైనే టైం పట్టొచ్చు.' అని గంగూలీ చెప్పారు. ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read: నయనతార రూల్ మార్చేశారా.? - కొత్త సినిమా ప్రారంభంలో నయన్, ఆమేనా అంటూ నెటిజన్లు షాక్