భార్య భర్తల మధ్య ప్రేమలు, గొడవలు, అలకలు సహజమే. ప్రతి ఇంట్లో ఏదో ఒక కథ ఉంటుంది. అయితే... ఇప్పటి వరకు తెరపై భర్తల కారణంగా భార్యలు పడిన ఇబ్బందుల నేపథ్యంలో సినిమాలు ఎక్కువ వచ్చాయి. బట్, ఫర్ ఎ ఛేంజ్... భర్తల బాధలను తెరపైకి తీసుకు వస్తున్నారు దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav). అదీ వినోదాత్మకంగా! ప్రేక్షకులను నవ్వించడం కోసం ఆయన ఓ వెబ్ సిరీస్ చేశారు.
పులులను, మొగుళ్లను కాపాడుకుందాం!
'పాఠశాల', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' సినిమాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు మహి వి. రాఘవ్. ఆయన, ప్రదీప్ అద్వైతం షో రన్నర్లు (క్రియేటర్లు) గా వ్యవహరించిన వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్' (Save The Tigers Web Series). అంతరించిపోతున్న పులులను, మొగుళ్లను కాపాడుకుందాం... అనేది ఉప శీర్షిక.
'సేవ్ ద టైగర్స్'లో అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి ఓ జంటగా... ప్రియదర్శి, 'జోర్దార్' సుజాత మరో జంటగా... చైతన్య కృష్ణ, దేవయాని ఇంకో జంటగా నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, హర్షవర్ధన్, రోషిని, సద్దాం తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
భార్యలు వర్సెస్ భర్తలు!
ఏప్రిల్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. మూడు జంటల మధ్య సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు.
ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో ఉండే భర్తగా అభినవ్ గోమఠం కనిపించారు. 'నేను ఉద్యోగం మానేయడం నీకు ఇష్టం లేదని నువ్వు ముందే చెప్పి ఉంటే నేను రిజైన్ చేసేవాడిని కాదు. అప్పుడు ఏమీ అనకుండా ఇప్పుడు అనడం అస్సలు బాలేదు' అని ఆయనతో డైలాగ్ చెప్పించారు.
'మా అయ్య కట్నంగా ఇచ్చిన పైసలన్నీ ఏం చేశావ్?' అని ప్రియదర్శిని 'జోర్దార్' సుజాత ప్రశ్నించడం చూస్తే... ఆ దంపతుల మధ్య డబ్బుల విషయంలో గొడవలు వచ్చినట్లు అర్థం అవుతోంది. ఇక, ఏం అడిగినా నవ్వే భర్తగా చైతన్య కృష్ణ కనిపించారు. ''మనం కూడా అడవుల్లో పులుల్లా అంతరించిపోదామా? లేకపోతే పోరాడి మన అస్థిత్వాన్ని కాపాడుకుందామా?'' అని బారులో తోటి భర్తలకు, కాబోయే మొగుళ్ళకు ఆయన పిలుపు ఇచ్చారు.
Also Read : దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ... ముగ్గురూ కలిసి ఏం చేశారు? మధ్యలో హర్షవర్ధన్ క్యారెక్టర్ ఏమిటి? అనేది ఏప్రిల్ 27న వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. భార్య భర్తల నేపథ్యంలో వచ్చిన టీవీ షోలు, న్యూస్ డిబేట్స్ వంటి చర్చా వేదికలను సైతం దర్శకుడు తేజా కాకుమాను వదల్లేదు. వాటిని వినోదాత్మకంగా చూపిస్తూ సున్నితమైన సెటైర్లు వేసినట్లు తెలుస్తోంది. 'సేవ్ ద టైగర్స్'తో తేజా కాకుమాను (Teja Kakumanu) దర్శకుడిగా మారారు. దీని కంటే ముందు 'బాహుబలి', 'ఆకాశవాణి' సహా పలు సినిమాల్లో నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఈ సిరీస్ కు రచన : ప్రదీప్ అద్వైతం, ఛాయాగ్రహణం : ఎస్.వి. విశ్వేశ్వర్, కూర్పు : శ్రవణ్ కటికనేని, సంగీతం : శ్రీరామ్ మద్దూరి.
Also Read : 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?