నెట్‌ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘జోంబీ డిటెక్టివ్’ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నన  ప్రముఖ దక్షిణ కొరియా నటి జంగ్ చై యుల్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తన అపార్ట మెంట్ లో శవమై కనిపించింది. 26 ఏండ్ల ఈ యువనటి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ విషయాన్ని అక్కడి న్యూస్ ఏజెన్సీలు అధికారికంగా ప్రకటించాయి.  అటు ఆమె కుటుంబ సభ్యులు కోరిక మేరకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. కొంత మంది సన్నిహితులు, బంధువులు మాత్రమే ఆమె అంతిమ సంస్కారాల్లో పాల్గొననున్నారు.  


జంగ్ మరణాన్ని ధృవీకరించిన వ్యక్తిగత సిబ్బంది


మరోవైపు జంగ్ చై యుల్ వ్యక్తిగత సిబ్బంది సైతం ఆమె మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో ఆమెపై ఎలాంటి ఊహాగానాలు రాయకూడదని మీడియాకు విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయని వెల్లడించారు. “మీతో ఒక బాధాకరమైన విషయాన్ని షేర్ చేసుకుంటున్నాం. నటి జంగ్ చై యుల్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంత్యక్రియలు జరుగుతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఆమె ఎలా చనిపోయారు అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఆమె మరణంపై ఎలాంటి ఊహాగానాలు రాయకూడదని మీడియాను కోరుతున్నాం” అని వెల్లడించారు.  


నెట్ ఫ్లిక్స్ షో ‘జోంబీ డిటెక్టివ్‌’ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు


సౌత్ కొరియాకు చెందిన జంగ్ చై 1996లో జన్మించింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. మోడల్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ఆర్వాత టీవీ షోలలోకి అడుగు పెట్టింది. పలు షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2020లో తను నటించిన నెట్ ఫ్లిక్స్ షో ‘జోంబీ డిటెక్టివ్‌’ ఆమె కెరీర్ కు మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. ఇందులో ఆమె బే యూన్ అనే పాత్ర పోషించింది. తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అటు ‘డీప్’ అనే సినిమాతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘వెడ్డింగ్ ఇంపాజిబుల్’ అనే చిత్రంలోనూ నటించి మెప్పించింది.  ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆమె మరణంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు నిలిపివేసినట్లు తెలుస్తోంది.  


చనిపోయే ముందు ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు ఇవే!  


ఇక ఈ యువ నటి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె మరణానికి ముందు ఇన్ స్టాలో బాధతో కూడిన ఫోటోలను షేర్ చేసింది. సంగీతం వింటూ మద్యం తీసుకుంటున్నట్లుగా  ఆ ఫోటోల్లో కనిపించింది. జంగ్ చై యుల్‌కు ఇన్ స్టాలో 27K కంటే ఎక్కువ మంది  ఫాలోవర్లు ఉన్నారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే, అభిమానులు, ఫాలోవర్లు  షాక్ అయ్యారు. తన మృతికి సంతాపం తెలిపారు.   






Read Also: ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’ ట్రైలర్ లో రైటర్ పేరు ఎందుకు వేయలేదు? సాజిద్ అసలు రచయిత కాదా?