తెలుగులో 'దిల్' రాజు (Dil Raju)కు తిరుగు లేదు. చిన్న, పెద్ద అని తేడా లేదు. కొత్త దర్శకుడు, పేరున్న దర్శకుడు అని వ్యత్యాసం లేదు. తనకు కథ నచ్చితే చాలు... సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. అందుకు మంచి ఉదాహరణ... ఈ మధ్య తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన 'బలగం' సినిమా. కుమార్తె హన్షిత, అన్నయ్య కుమారుడు హర్షిత్ నిర్మాతలుగా రావడంతో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మీద 'దిల్' రాజు దృష్టి సారించారు!


రజనీతో 'దిల్' రాజు సినిమా!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 'వారిసు' (తెలుగులో 'వారసుడు') సినిమాతో తమిళ చలన చిత్ర పరిశ్రమలో 'దిల్' రాజు అడుగు పెట్టారు. ఇప్పుడు ఆయన మరో తమిళ అగ్ర కథానాయకుడితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) కథానాయకుడిగా 'దిల్' రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల చేసేలా... యూనివర్సల్ కథతో సినిమా తీయనున్నారు. ఆల్రెడీ ఈ న్యూస్ తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమాకు దర్శకుడిని ఫైనలైజ్ చేశారట. 


కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో...
రజనీకాంత్, 'దిల్' రాజు సినిమాకు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. సంక్రాంతికి విడుదలైన 'వాల్తేరు వీరయ్య' సినిమాతో బాబీ భారీ విజయం అందుకున్నారు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా అగ్ర హీరోని ఎలా చూపించాలో తనకు తెలుసు అని పేరు తెచ్చుకున్నారు. 'వాల్తేరు వీరయ్య' సినిమాకు విమర్శకుల నుంచి పూర్తిస్థాయిలో ప్రశంసలు రాలేదు. కానీ, బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు వచ్చాయి. అందుకని, అతడి చేతిలో దర్శకత్వ బాధ్యతలు పెట్టారట. 


ఇప్పటి వరకు బాబీ తీసినవి అన్నీ కమర్షియల్ సినిమాలే. రవితేజ, పవన్ కళ్యాణ్, లేటెస్టుగా చిరంజీవిని కమర్షియల్ పంథాలో చూపించి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా రజనీని దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నారు.


Also Read : నయనతార - మాధవన్ - సిద్ధార్థ్ - ఓ 'టెస్ట్'


ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా విషయానికి వస్తే... 'కొలమావు కోకిల', 'వరుణ్ డాక్టర్', 'మాస్టర్' తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. అందులో శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ప్రధాన తారాగణం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. 'పుష్ప'లో విలనిజం పండించిన సునీల్, మరోసారి 'జైలర్'లో కూడా విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.


'జైలర్' కాకుండా 'లాల్ సలాం' అని మరో సినిమా కూడా చేస్తున్నారు రజనీకాంత్. అయితే, అందులో ఆయన హీరో కాదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే. కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటంతో ఆ సినిమాలో ఆయన గెస్ట్ రోల్ చేసేందుకు ఒప్పుకున్నారు.


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?