Sameer Wankhede Petition Against Bads Of Bollywood Web Series: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే సిరీస్‌లో నిషేధిత వస్తువులు వాడారంటూ కంప్లైంట్ అందండంతో NHRC తీవ్రంగా పరిగణించింది. ఇక తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మాజీ అధికారి సమీర్ వాంఖడే ఈ సిరీస్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిరీస్‌లో తనను తప్పుగా చూపించారని... తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.2 కోట్లు చెల్లించాలని పిటిషన్ వేశారు.
అసలేం జరిగిందంటే?
'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌లో యాంటీ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను నెగిటివ్‌గా చూపించారంటూ మాజీ అధికారి సమీర్ వాంఖడే పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికారి పాత్రను అభ్యంతరకర రీతిలో చూపిస్తూ... చట్టాలను అతిక్రమించి వాటిని అగౌరవపరిచారని తెలిపారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థపై పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.2 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఆయన కోర్టును కోరారు. ఈ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
అయితే, గతంలో క్రూజ్ నౌక డ్రగ్స్ వ్యవహారంలో ఆర్యన్ ఖాన్‌ను సమీర్ వాంఖడే బృందం అరెస్ట్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌తోనే ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా మారాడు. ఈ నెల 18 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. హీరో కావాలనుకునే ఓ యువకుడి కథ, హిట్ కొట్టిన తర్వాత సదరు హీరో ఇద్దరు ఫేమస్ ప్రొడ్యూసర్స్ మధ్య ఎలా నలిగిపోయాడు? అనేదే ప్రధానాంశంగా సిరీస్ తెరకెక్కింది.
Also Read: ప్లీజ్... నన్ను ఒంటరిగా వదిలేయండి - ఆమిర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ ఆగ్రహం
ఈ సిరీస్‌లో రాఘవ్ జ్యూయెల్, మోనా సింగ్, లక్ష్య, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్స్ చాలా వరకూ అతిథి పాత్రల్లో మెరిశారు. దిశా పటానీ, షారుక్ ఖాన్, కరణ్ జోహార్, దర్శక ధీరుడు రాజమౌళి, ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. రణబీర్ కపూర్ క్యామియో రోల్ చేశారు.
NHRC తీవ్ర ఆగ్రహం
ఇటీవల NHRC సైతం ఈ సిరీస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఓ సీన్‌లో నిషేధిత ఈ సిగరెట్ వినియోగించడంపై అభ్యంతరం తెలిపింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టం - 2019ని ఉల్లంఘించడమే కాకుండా ఎలాంటి వార్నింగ్స్ కానీ డిస్‌క్లైమర్స్ కానీ లేకుండా ఆ సీన్స్ ఉన్నాయంటూ వినయ్ జోషి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర సమాచార కమిషన్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. సిరీస్ నిర్మాతలు, రణబీర్, నెట్ ఫ్లిక్స్‌పై కేసు నమోదు చేయాలంటూ ముంబై పోలీసులను ఆదేశించింది. ఈ వివాదం మరిచిపోక ముందే మరో వివాదంలో సిరీస్ చిక్కుకుంది.