Samantha's Rakht Brahmand Web Series Update: ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలు ఏమీ లేవు. దీంతో ఆమె తరువాతి ప్రాజెక్ట్స్‌పై ఎప్పుడెప్పుడు క్లారిటీ వస్తుందా అని తన ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సినిమా కాకపోయినా సమంత... ఒక వెబ్ సిరీస్‌ను సైన్ చేసిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ టైటిల్ గురించి, ఇందులో క్యాస్టింగ్ గురించి సమాచారమంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కానీ ఎవరూ కూడా దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌లో సమంతకు జోడీగా గుడ్డూ భయ్యా అలియాస్ అలీ ఫజల్ నటించనున్నాడని సమాచారం.


హ్యాట్రిక్ కాంబో..


దర్శకులు రాజ్ అండ్ డీకేతో సమంతకు మంచి సాన్నిహిత్యం ఉంది. వారు చెప్పిన కథ నచ్చి ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో విలన్‌గా డీ గ్లామర్ రోల్‌లో నటించింది. ఆ సిరీస్ వల్ల బాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె చాలా దగ్గర అయ్యింది. ఇప్పుడు ‘సిటాడెల్’ అనే మరో సిరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించనుంది. దానిని కూడా రాజ్ అండ్ డీకేనే డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సమంతతో కలిసి మ్యాజిక్‌ను క్రియేట్ చేయడానికి రాజ్ అండ్ డీకే సిద్ధమయ్యారు. సామ్ లీడ్ రోల్ చేయనున్న ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించడానికి వారు ముందుకొచ్చారు. ఇందులో అలీ ఫజల్ హీరోగా నటించనున్నాడు.


భారీ ప్రాజెక్ట్స్..


అలీ ఫజల్‌కు ఓటీటీ ప్రపంచం కొత్త కాదు. ఇప్పటికే ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో గుడ్డూ భయ్యాగా అందరినీ ఆకట్టుకున్నాడు ఈ హీరో. తాజాగా ‘మీర్జాపూర్ 3’ విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకుంది. దీంతో‘రక్త్ బ్రహ్మాండ్’లో సమంత సరసన నటించే ఛాన్స్ కొట్టేశాడు అలీ ఫజల్. కొన్ని రోజుల క్రితం ఈ వెబ్ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తాడని వార్తలు వచ్చినా... ఇప్పుడు ఆ స్థానంలోకి అలీ ఫజల్ వచ్చినట్టు తెలుస్తోంది. ‘తుంబాడ్’ దర్శకుడు రాహీ అనిల్ బార్వే... ‘రక్త్ బ్రహ్మాండ్’ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం అలీ ఫజల్ చేతిలో పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’, అమీర్ ఖాన్ నిర్మిస్తున్న ‘లాహోర్ 1947’తో పాటు ‘మెట్రో ఇన్ దినో’ సినిమాలతో అలీ ఫజల్ బిజీగా ఉన్నాడు.


వచ్చేవారం నుండే..


‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ ఒక ఫ్యాంటసీ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. వచ్చే వారంలోనే సైలెంట్‌గా ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అలీ ఫజల్‌కు వరుస ప్రాజెక్ట్స్ ఉండడంతో తను ‘రక్త్ బ్రహ్మాండ్’ ఆగస్ట్ షెడ్యూల్‌లో జాయిన్ అవ్వనున్నాడు. చిన్న చిన్న షెడ్యూల్స్‌తో తన షూటింగ్‌ను పూర్తి చేయనున్నాడు. ఇలాంటి జోనర్ గానీ, ఇలాంటి పాత్రలు గానీ ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరని బాలీవుడ్ మీడియా అంటోంది. ‘రక్త బ్రహ్మాండ్’ సిరీస్‌లో కేవలం 6 ఎపిసోడ్లు ఉండగా.. వచ్చేవారం నుండి ముంబాయ్‌లో దీని షూటింగ్ ప్రారంభం కానుంది.



Also Read: హిందీ మార్కెట్‌పై ‘కల్కి 2898 ఏడీ’ దండయాత్ర - అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో సౌత్ సినిమాగా రికార్డ్