Srikanth Movie OTT: ఒక నెల, రెండు నెలల క్రితం విడుదలయిన సినిమాలన్నీ ఇప్పుడు వరుసగా ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని సినిమాలు అయితే ఓటీటీలో సైలెంట్‌గా స్ట్రీమింగ్ కూడా ప్రారంభించుకుంటున్నాయి. అలాగే రాజ్‌కుమార్ రావు హీరోగా నటించిన ‘శ్రీకాంత్’ సైతం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ మే 10న థియేటర్లలో విడుదలయ్యింది. బయోపిక్స్ తెరకెక్కించడంలో బాలీవుడ్ బెస్ట్ అని మరోసారి ‘శ్రీకాంత్‌’తో ప్రూవ్ అయ్యింది. ఇక థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.


కేవలం హిందీ..


ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో ‘శ్రీకాంత్’ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. థియేటర్లలో విడుదలయ్యి దాదాపు రెండు నెలలు అవుతుండడంతో సైలెంట్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఒక తెలుగు వ్యక్తి బయోపిక్ అయినా కూడా ‘శ్రీకాంత్’ కేవలం హిందీలో మాత్రమే విడుదలయ్యింది. అదే విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా హిందీ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మంచి రన్ సాధించడంతో ఏడు వారాల తర్వాత దీని ఓటీటీ రిలీజ్‌కు అనుమతినిచ్చారు మేకర్స్. ‘శ్రీకాంత్’ మూవీలో టైటిల్ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటించగా.. తన భార్య స్వామి పాత్రలో అలాయా ఎఫ్ అలరించింది.






సూపర్ హిట్ కలెక్షన్స్..


తుషార్ హీరానందని.. ‘శ్రీకాంత్’ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించాడు. ఒక ఎమోషనల్ కథను బయోపిక్‌గా తెరకెక్కించడంలో తుషార్ సక్సెస్ అయ్యాడని ప్రేక్షకులు ప్రశంసించారు. ఈ మూవీ దాదాపు రూ.40 కోట్ల నుంచి 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ దాటి రూ.62.92 కోట్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులకు రాజ్‌కుమార్ రావు నటనంటే చాలా ఇష్టం. ఇక ‘శ్రీకాంత్’తో మరోసారి తను అందరికీ ఫేవరెట్‌గా మారిపోయాడు. ఇందులో అంధుడి పాత్రలో రాజ్‌కుమార్ నటన.. చాలా సన్నివేశాలు తమను కన్నీళ్లు పెట్టించిందని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు.


శ్రీకాంత్ బొల్లా కథ..


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ బొల్లా అనే వ్యక్తి కథనే ‘శ్రీకాంత్’ సినిమాగా తెరకెక్కించారు తుషార్ హీరానందని. శ్రీకాంత్ పుట్టుకతోనే అంధుడు అయినా కూడా తనకంటూ ఒక గుర్తింపును ఎలా సంపాదించుకున్నాడు, బొల్లంట్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థను స్థాపించి ఎంతోమంది దివ్యాంగులను ఎలా ఉపాధి కల్పించాడు అనే అంశంపై సినిమా నడుస్తుంది. ఇక ‘శ్రీకాంత్’ మూవీలో రాజ్‌కుమార్ రావు, అలాయాతో పాటు జ్యోతిక కూడా మరో కీలక పాత్రలో కనిపించింది. వీరితో పాటు శరద్ కేల్కర్, జమీల్ ఖాన్, అనుష నుథులా, భారత్ జాదవ్, సుఖితా మూర్తి కూడా ఈ మూవీలో ఉన్నారు. ‘శ్రీకాంత్’ను థియేటర్లలో మిస్ అయినవారు నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయొచ్చు.



Also Read: శవాలతో తల్లీకూతుళ్ల సావాసం - ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ మూవీ గురించి తెలుసా?