Lal Salaam - OTT Release: ఈ రోజుల్లో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని కొంతమంది ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటే.. ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని మరో వర్గం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అయితే, సినిమా రిలీజైన నెలకో లేదా 40 రోజులకో సినిమాలు ఓటీటీల్లోకి వస్తాయి. బాగా ఆడిన సినిమాలు అయితే.. ఇంకొంచెం లేటుగా రిలీజ్ అవుతాయి. థియేటర్లలో అంతగా ఆదరణ రాని సినిమాలు అనుకున్న టైం కంటే కొంచెం తొందరగానే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' రిలీజ్ అయిన చాలా కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
స్ట్రీమింగ్ అక్కడే.. మార్చి మొదటి వారంలోనే..
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడిందనే చెప్పాలి. అనుకున్నంత ఆదరణ లభించలేదు ఈ సినిమాకి. దీంతో ఇప్పుడు తొందరగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారట. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ సినిమా మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోందనే వార్త చక్కర్లు కొడుతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దీని రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'లాల్‌సలామ్' చిత్రానికి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ హీరోగా నటించారు. రజనీకాంత్ ఈ సినిమాలో గెస్ట్‌రోల్ ప్లే చేశారు. ఈ సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. విక్రాంత్, టాలీవుడ్ నటులు జీవిత రాజశేఖర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 'లాల్ సలాం' సినిమాలో రజనీకాంత్ తో పాటుగా క్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకుర్చారు. విష్ణు రంగస్వామీ సినిమాటోగ్రఫీ అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మించారు. అయితే, ఈ సినిమా అనుకున్నంత రీతిలో ఆడలేదు. వసూళ్లు కూడా పెద్దగా రాలేదు. ఇక తెలుగులో అయితే, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఆదరణ లభించలేదు. చాలా థియేటర్లో జనాలు లేక షో లు క్యాన్సిల్ చేశారు నిర్వాహకులు. రజనీకాంత్ సినిమాకి తెలుగులో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఇదే మొదటిసారి అనిచెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా కలెక్షన్లు చాలా తక్కువ వచ్చాయి.
రజనీకాంత్ సినిమాలకి తమిళంలో ఎంత క్రేజ్ ఉంటుందో.. తెలుగులో కూడా అంతేక్రేజ్ ఉంటుంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. చడీచప్పుడు లేకుండా తెలుగులో విడుదల చేశారు. చాలామంది తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఒకటి రిలీజైందనే విషయం కూడా తెలీదు. యూట్యూబ్ లో కేవలం 11 రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తెలుగులో ప్రమోషన్స్ కూడ చేయలేదు. ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ కూడా నటించారు. కనీసం ఆమెతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినా జనాలు థియేటర్లకు వెళ్లేవారేమో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: కలెక్షన్స్ వసూళ్లలో ‘ఈగల్’ ఢమాల్ - రవితేజను వెంటాడుతోన్న ఫ్లాప్స్, నష్టం ఎంతంటే?