Extended version of 'Aadujeevitham' in OTT: 'ఆడుజీవితం'.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈ సినిమా. సౌదీలో కూలీలు పడే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా ఇది. వాస్తవంగా జరిగిన కథ ఇది. బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. థియేటర్ లో రిలీజైన ఈ మలయాళి సినిమాకి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. సినిమా అద్భుతంగా ఉందంటూ ఎంతోమంది రివ్యూలు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ ఎక్కడో ప్రకటించింది చిత్ర బృందం. అంతేకాకుండా సినిమా ఎక్సటెంటెడ్ వెర్షన్‌ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.
మూడున్నర గంట సినిమా..
కేరళ నుంచి సౌదీ వెళ్లిన కూలీ పడ్డ కష్టాలను చూపించారు ఈ సినిమాలో. దీంతో అనుకున్నది అనుకున్నట్లు చూపించేందుకు మూడున్నర గంటలు వచ్చిందట. అయితే, థియేటర్లలో ప్రేక్షకులు అంతసేపు చూడలేరు కాబట్టి.. దాన్ని ట్రిమ్ చేసి రిలీజ్ చేశారట మేకర్స్. అయితే, ఓటీటీలో మాత్రం మూడున్నర గంటల నిడివితో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారట.
పాజిటివ్ టాక్..
ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది సినిమా. దీంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. వివిధ భాషల్లో రిలీజైన ఈ సినిమా మన దేశంలో మొదటి రోజే రూ. 7కోట్లు కలెక్షన్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.15 కోట్లు కలెక్షన్లు సాధించింది.
'ఆడు జీవితం' చిత్రంలో పృథ్వీరాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. క్యారెక్టర్ లో కరెక్ట్ గా సరిపోయేందుకు ఏకంగా 31 కేజీలు తగ్గారట. 'ఆడు జీవితం' సినిమా.. దాదాపు 16 ఏళ్ల తర్వాత సెట్స్ పైకి వచ్చిందట. 16 ఏళ్ల నుంచి ఈ సినిమాపై వర్క్ చేసి.. 2018లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత కరోనా రావడం, అదే టైంలో సినిమా యూనిట్ మొత్తం ఎడారిలో దాదాపు మూడు నెలలు చిక్కుకుపోవడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అలా అన్ని అడ్డంకులు దాటుకుని 2022లో సినిమా షూటింగ్ పూర్తి చేయగా.. ఏడాదిన్నర పాటు దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన వర్క్ జరిగి ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో పృథ్వీ రాజ్ కి జోడీగా అమలాపాల్ నటించింది. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా, రసూల్ పూకుట్టి సౌండ్ ఇంజినీర్‌గా వర్క్ చేసారు. సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెలుగు వెర్షన్ ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: మూడో రోజూ అదే రచ్చ - ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరుగుతాయ్, ఎంత వచ్చిందో తెలుసా?