Police Police Web Series OTT Release On Jio Hotstar: క్రైమ్, కామెడీ, హారర్ థ్రిల్లర్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీతో పాటే థ్రిల్ పంచేందుకు మరో వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. ఇప్పటికే మూవీస్, వెబ్ సిరీస్‌లతో ఎంటర్‌టైన్ చేసిన ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' మరో కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో అలరించబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన వెబ్ సిరీస్ 'పోలీస్ పోలీస్'ను సెప్టెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన తమిళ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆర్జే సెంథిల్, కొత్త నటుడు జయశీలన్ ప్రధాన పాత్రల్లో నటించగా... షబానా షాజహాన్, సుజిత ధనుష్, విన్సెంట్ రాయ్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది. 

Also Read: 'కొత్త లోక 1: చంద్ర' రివ్యూ: ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో సినిమా - కల్యాణీ ప్రియదర్శన్ మూవీ ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే?

తమిళ ట్రైలర్‌లో చూపించిన వివరాల ప్రకారం... మఫ్టీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తూ అతని ఫోన్ కొట్టేస్తాడు. దీన్ని చూసిన ఓ మహిళా న్యాయవాది... అతన్ని దొంగ అనుకుని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. అయితే, తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిన సదరు మఫ్టీ ఆఫీసర్... పై అధికారికి అసలు విషయం చెప్పి ఆ ఫోన్ ఇచ్చేస్తాడు. ఆమెతో పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. సెల్ ఫోన్ చోరీపై కంప్లైంట్ ఇస్తుండగా... పై అధికారి తనను కొట్టినట్లు నటిస్తాడు.

తీవ్ర గాయాలతో బయటకు వచ్చిన అతన్ని చూసిన మహిళా లాయర్ చలించిపోతుంది. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తుంది. అసలు వీరి లవ్ ట్రాక్ ఎక్కడి వరకూ వెళ్లింది? సదరు ఆఫీసర్ ఎందుకు మఫ్టీలో ఉన్నాడు. ఆ వ్యక్తి నుంచి ఎందుకు ఫోన్ చోరీ చేశాడు? అసలు సాల్వ్ చేయాల్సిన కేస్ ఏంటి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.