స్టార్స్ కు ఇటీవల కాలంలో మీడియా నుంచి కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినప్పటికీ, ఆ టైంలో సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారు అన్నదే ముఖ్యం. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి (Rana Daggubati)కి కూడా తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అయితే ఇదొక ఎత్తు అనుకుంటే, అదే ఈవెంట్ లో రానా దగ్గుబాటి తన షోకి పవన్ కళ్యాణ్ రారు అంటూ బాంబు పేల్చి పవర్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చారు.
రానా దగ్గుబాటి హోస్టుగా 'ది రానా దగ్గుబాటి షో'ను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ షో మొదలు కాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను శుక్రవారం రిలీజ్ రిలీజ్ చేశారు రానా. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అయితే ఈవెంట్ లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకి రానా సమాధానం చెప్పారు. అందులో భాగంగా ఓ జర్నలిస్ట్ "మీ షోని పాన్ ఇండియా స్టార్లతో కాకుండా టైర్ 2 హీరోలతో ఎందుకు ప్రారంభించారు?" అని ప్రశ్నించారు. దీంతో ఈ ప్రశ్నకు ఒకసారిగా అవాక్కైన రానా నవ్వును ఆపుకోలేక పోయారు. ఆయన స్పందిస్తూ "అవి ఏమైనా ట్రైన్ బెర్తులా? ఈ బెర్త్ లను ఎవరు బుక్ చేశారు?" అని నవ్వుతూ ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తి "అంటే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా స్టార్లతో షోని మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ వాళ్లతో కాకుండా ట్రైలర్ ని చూస్తే ఇతర హీరోలు ఉన్నట్టుగా కనిపిస్తోంది" అంటూ సమాధానం చెప్పాడు.
Also Read: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
దీంతో రానా "సినిమాలు తీసే వాళ్ళకు లెక్కలు ఉంటాయేమో గాని ప్రేక్షకులకు ఉండవు. కంటెంట్ నచ్చితే కచ్చితంగా సినిమా చూస్తారు. ఒక ప్రాంతీయ సినిమాగా తెరకెక్కిన 'హనుమాన్'ను ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు చూసి ఆదరించారు. అలాగే 'బాహుబలి' మూవీకి ముందు మేము కూడా నార్త్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. సినిమానే నటినటులను స్టార్స్ ను చేస్తుంది. టైర్ 1, టైర్ 2 అనేది చెప్పుకోవడానికి బాగుంటుందేమో గానీ నేను దాన్ని నమ్మను" అని చెప్పుకొచ్చారు. ఇక ఇంతకు ముందు తను చేసిన షోకు, ఈ ప్రోగ్రాంకి అస్సలు సంబంధం ఉండదని, ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగిన చర్చలు, వార్తల గురించి ఈ షోలో ప్రస్తావన ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఒక్కో ఎపిసోడ్ ను నాలుగు గంటల పాటు చిత్రీకరించగా, దాదాపు 40 నిమిషాల నిడివితో స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు.
ఇక పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ గురించి చెప్పుకోవాలి. ఆయన ఇప్పటికే 'అన్ స్టాపబుల్' అనే సెలబ్రిటీ టాక్ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రానా టాక్ షోలో కూడా పవన్ కళ్యాణ్ స్టార్ కూడా ఎంట్రీ ఇస్తారేమోనని పవర్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ రానా మాట్లాడుతూ "పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి మా షోకు వచ్చే ఛాన్స్ లేదు" అని ముందుగానే తేల్చి చెప్పేశారు. ఇది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే విషయమే. ఇదిలా ఉండగా ఈ షోలో రిషబ్ శెట్టితో చేసిన ఎపిసోడ్ తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చారు. "ఎందుకంటే నాకు కన్నడ రాదు, ఆయనకు తెలుగు రాదు. రిషబ్ హిందీలో బాగా మాట్లాడుతారు. కానీ నాకు హిందీలో ప్రశ్నలు వేయడం రాదు" అని చెప్పుకొచ్చారు. అయితే ఇద్దరికీ తమిళం కొంతవరకు తెలియడంతో దాంతోనే మేనేజ్ చేశారట.