Parasyte The Grey On Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోని వెబ్ సిరీస్‌లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాదు.. భాషతో సంబంధం లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన దాదాపు అన్ని సిరీస్‌లు ఓ రేంజ్‌లో హిట్‌ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు అదే లిస్ట్‌లో యాడ్ అవ్వడానికి వచ్చేస్తోంది కొరియన్ సిరీస్ ‘పారాసైట్: ది గ్రే’. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్నో ప్రముఖ కొరియన్ సిరీస్‌లు సూపర్ హిట్ అందుకోగా.. ‘పారాసైట్: ది గ్రే’పై ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 5న స్ట్రీమింగ్ ప్రారంభించుకోనున్న ఈ సిరీస్ ఎందుకు చూడాలి అంటే కొరియన్ ఫ్యాన్స్ చెప్తున్న కారణాలు ఇవే..


పుస్తకం ఆధారంగా..


ఇప్పటికే పుస్తకాల ఆధారంగా ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. ‘పారాసైట్: ది గ్రే’ కూడా అదే తోవకు చెందింది. హితోషి ఇవాకీ అనే రైటర్.. జపాన్‌లో ఫేమస్ కార్టున్ అయిన పారాసైట్‌ను క్రియేట్ చేశారు. ఆ యానిమీ పుస్తకం ఇప్పటివరకు 25 మిలియన్ల కాపీలను అమ్ముడుపోయేలా చేసింది. ‘పారాసైట్: ది గ్రే’ సిరీస్ కూడా ఇదే పుస్తకంపై ఆధారపడి తెరకెక్కింది. పుస్తకంలో ఉన్న కథను ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించకపోయినా.. స్టోరీ లైన్‌లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సిరీస్‌లో సున్-ఇన్ అనే పాత్రలో జియోన్ సో-నీ నటించింది. ఇందులో తను మనుషులు, వింత జీవుల మధ్య ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ‘పారాసైట్: ది గ్రే’ కథ.


కొత్త అంశాలతో..


ఇయోన్ సంగ్-హో.. ‘పారాసైట్: ది గ్రే’ను డైరెక్ట్ చేశారు. తను ఇంతకు ముందు ‘ట్రైన్ టు బూసన్’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో పాటు ‘హెల్‌బౌండ్’ అనే సిరీస్‌ను కూడా తెరకెక్కించారు. అయితే యానిమీ పుస్తకంలో చూడని కొన్ని కొత్త అంశాలను కూడా సిరీస్‌లో చూస్తారని ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు ఇయోన్. ఇప్పటికే విడుదలయిన ‘పారాసైట్: ది గ్రే’ ట్రైలర్ చూస్తుంటే ఇదొక మామూలు కొరియన్ డ్రామాలాగా అనిపించడం లేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. మామూలుగా కొరియన్ డ్రామాలలో ఏ జోనర్ సిరీస్‌లు అయినా 16 ఎపిసోడ్లు ఉంటాయి. కానీ ‘పారాసైట్: ది గ్రే’ మాత్రం 6 ఎపిసోడ్లే. అంటే ఎక్కువగా ఇందులో అనవసరమైన సీన్స్ లేవని అర్థమవుతోంది.


వింత ఆకారాల్లో జీవులు..


కొరియన్ సినీ పరిశ్రమ ఏ రేంజ్‌లో ప్రయోగాలు చేయగలదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పారాసైట్: ది గ్రే’తో మరోసారి మరో కొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులను ముందుకు తీసుకురానున్నారు ఇయోన్ సంగ్-హో. ఇందులో సైన్స్ ఫిక్షన్ అంశాలతో పాటు హారర్ కూడా ఉందని ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. వింత వింత ఆకారాల్లో ఉన్న జీవులు.. ప్రేక్షకులను భయపెట్టేలా ఉన్నాయి. ‘పారాసైట్: ది గ్రే’ ట్రైలర్ ప్రకారం ఒక పారాసైట్ మనుషుల చెవుల్లోకి వెళ్లడం వల్ల వారు వింత జీవులుగా మారుతారని అర్థమవుతోంది. ఇప్పటికే ‘పారాసైట్: ది గ్రే’ టీజర్‌కు 3 మిలియన్ల వ్యూస్ రాగా.. ట్రైలర్ విడుదలయిన 48 గంటల్లోనే 10 వేల వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఈ సీరిస్ కోసం ఎంతమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది.



Also Read: కలలోనూ వెంటాడే సినిమా ‘ఇన్సెండీస్’ - క్లైమాక్స్‌ను మీరు అస్సలు ఊహించలేరు, కంపరం పుట్టిస్తుంది