‘ఇన్సెండీస్’.. అంటే ఫైర్స్ అని అర్థం. చనిపోతూ కూడా చల్లారని ఓ తల్లి కన్నీటి మంటల గాథ ఇది. ‘ఇన్సెండీస్’ 2010 సెప్టెంబర్‌లో విడుదలయిన కెనెడియన్ డ్రామా ఫిల్మ్. దేశం పేరు ఎక్కడా చెప్పనప్పటికీ ఈ చిత్రంలో సంఘటనలు లెబనీస్ అంతర్యుద్ధాన్ని, నిజ జీవితంలో ఖైదీ సౌహా బెచారా కథను ప్రతిబింబించేలా ఉంటాయి.


ఆమె జీవితాంతం ఏ కొడుకు కోసమైతే వెతికుతుందో.. అతను కనిపిస్తాడు. కానీ ఎలాంటి దుర్భరమైన స్థితిలో అనేది చివరి వరకు ఉత్కంఠ స్థితిలో సాగుతుంది.


మిడిల్ ఈస్టర్న్ దేశంలోని ఒక చిన్న క్రిస్టియన్ అరబ్ కుటుంబానికి చెందిన స్త్రీ నవల్ మర్వాన్ కథే ఇది. లెబనీస్ సివిల్ వార్ వంటి బ్యాక్ డ్రాప్ లో కథంతా సాగుతుంది. రెండు మతాల మధ్య రక్తపాతం జరుగుతున్న సమయం అది. అదే సమయంలో నవల్ ఒక రెఫ్యూజీ(వలసదారుడు)ని ప్రేమిస్తుంది. వాళ్లిద్దరూ పారిపోతుంటారు. ఆమె అప్పటికే ప్రెగ్నెంట్. విషయం తెలుసుకొని ఆమె అన్నలు నవల్ ప్రేమించిన వ్యక్తిని అక్కడికక్కడే కాల్చేస్తారు. నవల్ అమ్మమ్మ తనకు పురుడు పోస్తుంది. ఒక రెఫ్యూజీకి పుట్టిన బిడ్డను బతకనివ్వరని, అనాథాశ్రమానికి పంపించేస్తుంది. కానీ అంతకంటే ముందు ఆ బిడ్డకు మూడు చుక్కలతో పచ్చబొట్టు వేస్తుంది. అది ఆ తల్లి పాలిటి వరమో, శాపమో తేల్చటం కష్టం. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం కొన్నిరోజుల పాటూ డిస్టర్బ్ చేస్తుంది. 


నిజజీవితంలో జరిగిన మత విధ్వంసాల ఆధారంగా తీసిన ఈ చిత్రం సమాజం గుండెల్లో కత్తిపోటు పొడిచి ప్రశ్నించినట్టు ఉంటుంది. ఫలానా మతంలో, ఫలానా కులంలో మన పుట్టుక అనేది పూర్తిగా యాధృచ్చికం. కేవలం మతం పేరుతో మనుషులు సృష్టించిన ఈ రక్తపాతం కారణంగా, ఎంత మంది నవల్ లాంటి తల్లులు చిత్రవధ అనుభవించారో అనిపిస్తుంది.


దేవుడు పేరు మీద మత కల్లోలాలు సృష్టించి, ఆడవారిని శారీరకంగా హింసించి, జైల్లో పెట్టి, చిన్న పిల్లల్ని కూడా చూడకుండా వేరే మతమైతే అక్కడికక్కడే కాల్చిపడేసి...ఇంత రక్తపాతం ఎందుకు? ఇంత పగ ఏం సాధించటానికి? వారి పిల్లలూ బలైపోతున్నారే? ఇవన్నీ ప్రశ్నలు సినిమా చూస్తున్నంతసేపు సూదుల్లా గుచ్చుతుంటాయి.


మతాల మీద ప్రతీకారంతో బయలుదేరిన నవల్ మర్వాన్.. ముస్లిం ఫైటర్స్ తో కలిసిపోయి క్రిస్టియన్ నేషనలిస్ట్ లీడర్ ను కాల్చిపారేస్తుంది. అందుకు ఆమెను జైల్లో బంధిస్తారు. కొన్ని యేళ్ల పాటు ఆమెను శారీరకంగా చిత్రవధ చేస్తారు. అక్కడ నవల్ కవలలకు జన్మనిస్తుంది. వారిని నర్స్ కాపాడి అక్కడ్నుంచి పంపివేస్తుంది. 


వారు పెరిగి పెద్దయ్యాక, తల్లిదండ్రుల జాడ కోసం వెతుకుతుంటారు. నవల్ జైల్లో మగ్గిపోతూ తన మొదటి కొడుకు కోసం జీవితాంతం వెతుకుతూనే ఉంటుంది. చివరికి ఆమె నిజం తెలుసుకుంటుంది. ఆమె తెలుసుకునే నిజం ఏ తల్లి తట్టుకోలేనంత ఘోరమైన, అతి నీచమైన నిజం. దాన్ని ఇక్కడ అక్షరాల్లో కూడా చెప్పలేం. ఆ మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఆమెకు తెలిసిన నిజాన్ని మీరు జీర్ణించుకోడానికి.. చాలా రోజులు పడుతుంది.


మూవీ క్లైమాక్స్‌లో నవల్ ఆ నిజాన్ని ఉత్తరం ద్వారా తన కవల పిల్లలకు తెలియజేస్తుంది. అసలు వారికి చెప్పాల్సిన అవసరమేముంది అని చూస్తూనే మనం తల్లడిల్లిపోతాం. కానీ, వారికి నిజం తెలుసుకునే అర్హత ఉందని మనమే మళ్ళీ ఓదార్చుకుంటాం. ఆ క్లైమాక్స్‌కు కళ్లు చెమ్మగిల్లటం అనేది చాలా చిన్నమాట. సినిమా చూశాక, ఎన్నో ప్రశ్నలు, చెప్పలేనంత వేదన మనల్ని చాలా కాలం వెంటాడుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండేది. ఇటీవలే దీన్ని తొలగించారు. ప్రస్తుతం యాపిల్ టీవీ ప్లస్‌లో స్ట్రీమ్ అవుతోంది.


Also Read: ఈ సినిమా చూస్తే లైట్ కట్టాలంటేనే భయమేస్తుంది - ఒంటరిగా చూస్తే ఇక అంతే