ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ... కథానాయకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు సాయిరాం శంకర్. పూరి దర్శకత్వం వహించిన '143', పూరి అందించిన కథతో రూపొందిన 'బంపర్ ఆఫర్' సినిమాలతో విజయాలు అందుకున్నారు. తొలుత సక్సెస్ వచ్చిన ఆ తరువాత ఫెయిల్యూర్స్ కారణంగా గ్యాప్ వచ్చింది. కొంత విరామం తర్వాత సాయిరాం శంకర్ హీరోగా నటించిన సినిమా 'ఒక పథకం ప్రకారం'. త్వరలో ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.
విశాఖలో వరుస హత్యలు...హీరో మీద అనుమానాలు!సాయిరాం శంకర్ సరసన ఆషిమా నర్వాల్ కథానాయికగా నటించిన 'ఒక పథకం ప్రకారం' సినిమాలో శ్రుతి సోది, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. హీరో లాయర్ అయితే... శృతి సోది పోలీస్ ఆఫీసర్. ఆవిడ మాత్రమే కాదు... సముద్రఖని కూడా పోలీస్! ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే...
విశాఖలో సిద్దార్థ్ నీలకంఠ (సాయిరామ్ శంకర్) పబ్లిక్ ప్రాసిక్యూటర్. మంచి లాయర్ అని అతడికి పేరు ఉంది. అయితే... ప్రేమించి పెళ్లి చేసుకున్న సీత (ఆషిమా నర్వాల్) కనిపించకుండా పోయిన తర్వాత మందు, మత్తు పదార్థాలకు బానిస అవుతాడు. ఒకానొక టైంలో డ్రగ్స్ తీసుకుని కోర్టుకు వెళతాడు. దాంతో అతడిని సస్పెండ్ చేస్తారు. కోర్టు నుంచి సస్పెండ్ అయ్యాక దివ్య (భానుశ్రీ) మర్డర్ కేసులో సిద్ధార్థ్ నీలకంఠ మీద అనుమానం కలుగుతుంది. అతడి మీద నింద రావడానికి పోలీస్ ఆఫీసర్ రఘురామ్ (సముద్రఖని). అయితే... సిద్ధార్థ్ హత్య చేశాడంటే ఏసీపీ కవిత (శ్రుతి సోది) నమ్మదు. ఎలాగోలా తన తెలివితేటలు ఉపయోగించి మర్డర్ కేసు నుంచి బయటపడతాడు సిద్ధార్థ్ నీలకంఠ.
దివ్య మర్డర్ కేస్ నుంచి బయటపడిన సిద్ధార్థ్ నీలకంఠకు ఆ తర్వాత వరుస షాక్స్ తగులుతాయి. విశాఖలో వరుసగా మరో మూడు హత్యలు జరుగుతాయి. ప్రతి హత్య తర్వాత సిద్ధార్థ్ నీలకంఠ మీద అనుమానాలు మరింత పెరుగుతాయి. అయితే తాను హత్యలు చేయలేదని అతడు చెబుతాడు. మరి ఆ హత్యలు ఎవరు చేశారు? హంతకుడు ఎవరో తెలుసుకోవాలని సిద్ధార్థ్ నీలకంఠ ఎటువంటి ప్రయత్నం చేశాడు? చివరకు ఏం తెలిసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: 'ఈగ'ను కాపీ చేశారు... మలయాళ సినిమాకు రాజమౌళి నిర్మాత కాపీరైట్ నోటీసులు
Oka Pathakam Prakaram OTT Release Date: జూన్ 27వ తేదీ నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో అంతగా ఆడని ఈ సినిమాకు ఓటీటీలో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. విలన్ ఎవరో చెబితే 10000 ఇస్తామని అనౌన్స్ చేయడం వల్ల మంచి పబ్లిసిటీ అయితే వచ్చింది గాని ప్రయోజనం కలగలేదు.
Also Read: అనుష్కతో విక్రమ్ ప్రభు పెళ్లి... లిరిసిస్ట్‌గా మారిన క్రిష్... 'సైలోరే' రాసింది దర్శకుడే
సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా శృతి సోది, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో 'కళాభవన్' మణి, రవి పచ్చముత్తు, భాను శ్రీ, పల్లవి గౌడ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి దర్శకుడు: వినోద్ విజయన్, నిర్మాతలు: వినోద్ విజయన్ - రవి పచ్చముత్తు - గార్లపాటి రమేష్, నిర్మాణ సంస్థలు: వినోద్ విజయన్ ఫిలిమ్స్ - విహారి సినిమా హౌజ్, సంగీతం: రాహుల్ రాజ్, నేపథ్య సంగీతం: గోపీ సుందర్