మలయాళ హీరో టోవినో థామస్ (Tovino Thomas) నుంచి ఈ ఏడాది ‘ఎఆర్ఎమ్’, ‘అన్వేషిప్పిన్ కండెత్తుమ్’, ‘నడిగర్’ సినిమాలు వచ్చాయి. అటు థియేటర్‌లోనూ, ఇటు ఓటీటీలోనూ ‘అన్వేషిప్పిన్ కండెత్తుమ్’ సూపర్ హిట్ అయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఎఆర్ఎమ్’, ‘నడిగర్’ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. ‘ఎఆర్ఎమ్’కు ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు టోవినో థామస్ నటించిన సినిమా ‘నారదన్’ (Naradan Movie) ఓటీటీలో వచ్చింది.
ఆహా ఓటీటీలో ‘నారదన్’ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్
Naradan Telugu OTT Release Date: టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ సినిమా ‘నారదన్’. ఈ సినిమాలో 2022లో విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ మరి కొద్ది గంటల్లో విడుదల కానుంది. ‘కల్కి 2898 ఎడీ’ ఫేమ్ అన్నా బెన్, జాయ్ మ్యాథ్యూ, షరాఫుద్దీన్, ‘కిష్కింధ కాండం’ ఫేమ్ విజయ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు. ఇప్పుడీ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భవానీ మీడియా ద్వారా ఆహాలో ‘నారదన్’ విడుదలైంది.
జర్నలిస్ట్ గా తన కంటూ పేరు తెచ్చుకోవాలనే ఆశయంతో ఓ న్యూస్ ఛానల్ లో చేరతాడు చంద్ర ప్రకాశ్ (టోవినో థామస్). తన స్నేహితుడు ఓ న్యూస్ స్టోరీ చేసి వేరే ఛానల్ లోకి మంచి పొజిషన్ కు వెళతాడు. చంద్ర ప్రకాశ్ కు మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఎలాగైనా తమ ఛానెల్ టీఆర్పీ పెంచాలని బాస్ ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడ నుంచి చంద్ర ప్రకాశ్ గాడి తప్పుతాడు. ఇది తప్పా? ఒప్పా అని చూడకుండా ప్రతి న్యూస్ ను సెన్సేషన్ చేయాలని చూస్తాడు. ఛానల్ కంటే ఎత్తుకు ఎదుగుతాడు. ఇదే సమయంలో అతనికి ఓ కొత్త ఛానల్ ను మొదలు పెట్టాలని ఓ మినిస్టర్ నుంచి ఆఫర్ వస్తుంది. అదే ‘నారద న్యూస్’ ఛానల్. అక్కడ కూడా తన పంథాను కొనసాగిస్తాడు. పోటీని తట్టుకోవడానికి అన్ని అడ్డదారులూ తొక్కుతాడు. ఇదే అతన్ని న్యాయపరమైన చిక్కుల్లో పడేస్తుంది. ఈ పరిణామాల తర్వాత చంద్రప్రకాశ్ చాలా సైలెంట్ అయిపోతాడు. తన తప్పు తాను తెలుసుకొని దాన్ని సరిదిద్దు కొనే ప్రయత్నంలో ఏం చేశాడన్నదే కథ. సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు ఆషిక్ అబు.
టోవినో థామస్ హీరోగానే కాకుండా క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ‘ఐడెంటిటీ’ అనే మలయాళ సినిమాలో టొవినో థామస్ నే హీరో. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న లూసీఫర్ సీక్వెల్ ‘ఎల్ 2 ఎంపురన్’ చిత్రంలోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘నారదన్‘ సినిమా ఒరిజినల్ మలయాళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటు లో ఉంది.