Nani HIT 3 OTT Streaming Controversy: నేచురల్ స్టార్ నాని రీసెంట్ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3: ద థర్ట్ కేస్'. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 1న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా.. గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఊహించని ట్విస్ట్
ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మూవీ టీంకు ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ శైలేష్ సహా మూవీ టీంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూవీ తమిళ వెర్షన్‌లో ఓ డైలాగ్ వివాదానికి దారి తీసింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో 'హిట్ 4'కు సంబంధించి కార్తి రోల్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
చెక్ పోస్ట్ వద్ద ఓ వ్యాన్ తనిఖీ చేస్తుండగా.. డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ తెలుగులో మాట్లాడుకుంటుంటారు. వ్యాన్‌లో డెడ్ బాడీ ఉందని అది ఎక్కడో మట్టి అడుగున ఉందంటూ మాట్లాడుకుంటుండగా పోలీస్‌కు తెలుగు అర్థం కాదని అనుకుంటారు. ఇదే సమయంలో కార్తి మొబైల్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఉంటుంది. తెలుగు వెర్షన్‌లో.. 'నాకు తెలుగు తెలియదని మీరు అనుకుంటున్నారా? నాకు రెండు భాషలు తెలుసు.' అని అంటాడు.
Also Read: పవన్ 'ఓజీ'లో చంద్రబాబు ఇంటికి కాబోయే కోడలు... మెగా మేనల్లుడు ఆట పట్టించడం వెనుక అసలు కహానీ
ఆ డైలాగ్‌పై రచ్చ
అయితే, తమిళ డబ్బింగ్ వెర్షన్‌లో ఈ డైలాగ్ వచ్చేటప్పుడు ఈ లైన్‌లో 'గుల్టి' (తెలుగు వర్డ్‌ను రివర్స్‌లో ఇలా రాస్తారు) అనే పదం ఉంది. ఈ పదం తెలుగు మాట్లాడే వారిని అవమానించేదిగా ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇలాంటి వర్డ్ ఎలా వాడతారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైరల్ అవుతుండగా.. ఆ సీన్‌కు సంబంధించి క్లిప్స్ వైరల్ చేస్తున్నారు. డైరెక్టర్‌తో పాటు మూవీ టీం తీరును తప్పుబడుతున్నారు. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని 'హిట్ 3' నిర్మించారు. నాని సరసన కేజీఎఫ్ ఫేం 'శ్రీనిధి శెట్టి' (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించారు. సినిమాలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా రికార్డు కలెక్షన్లు సాధించింది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
స్టోరీ ఏంటంటే?
అర్జున్ సర్కార్ (నాని) ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో ఆఫీసర్‌గా ఉండగా.. ఓ దారుణ హత్య వెలుగుచూస్తుంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. దీని వెనుక 'డార్క్ వెబ్' అనే ఓ క్రైమ్ గ్రూప్ ఉందని తెలుసుకున్న అర్జున్ అందులో చేరేందుకు ఏం చేశాడు?, బాధితులను ఎలా కాపాడాడు?, ఆ నెట్ వర్క్ నిందితులను ఎలా పట్టుకున్నాడు? అనేదే స్టోరీ.