Mayasabha series cast original names of actors and photos: సోనీ లివ్ ఓటీటీ కోసం దర్శకుడు దేవా కట్టా రూపొందించిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'మయసభ'. హీరోలు ఆది పినిశెట్టి, చైతన్య రావు గెటప్స్ నుంచి క్యారెక్టర్స్ తీర్చిదిద్దిన తీరు వరకు నిశితంగా గమనిస్తే నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారు. ఆ ఇద్దరి మధ్య స్నేహం మీద తీసిన సిరీస్ 'మయసభ' అని అర్థం అవుతోంది. కానీ, అది నిజం కాదని దేవా కట్టా చెబుతున్నారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్లు కాదని చెబుతున్నారు. ఆయన వెర్షన్ పక్కన పెడితే... ఇప్పటికే విడుదలైన ట్రైలర్ బట్టి ఎవరి పాత్రను ఎలా చూపించారు? ఎవరు ఏ పాత్రలో నటించారు? అనేది తెలుసుకోండి. 

'మయసభ'లో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. ఆ గెటప్, క్యారెక్టర్ ఆర్క్ చూస్తే ప్రేక్షకులకు నారా చంద్రబాబు నాయుడు గుర్తుకు రావడం గ్యారెంటీ. 'మయసభ'లో మరో హీరో '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు. ఎంఎస్ రామి రెడ్డి పాత్రలో ఆయన నటించారు. ఏపీ మాజీ సీఎం, దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారు. 

దేవా కట్టా దర్శకత్వం వహించిన 'ప్రస్థానం', 'ఆటో నగర్ సూర్య' సినిమాల్లో డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటించారు. ఇప్పుడీ 'మయసభ'లోనూ ఆయన ఉన్నారు. తెలుగు చిత్రసీమలో అప్పటి టాప్ స్టార్, ప్రేక్షకులు అంతా దేవుడిగా కొలిచిన రాయపాటి చక్రధర్ రావు (ఆర్‌సిఆర్) పాత్రలో నటించారు సాయి కుమార్. ఆర్‌సిఆర్ గెటప్, సాయి కుమార్ యాక్టింగ్ చూస్తే సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. 

ఐరావతి బసు... 'మయసభ'లో పీఎం క్యారెక్టర్ పేరు. దేశంలో ఎమర్జెనీ విధించిన ప్రధానిగా ఆమెను చూపించారు. ఇండియాలో ఎమర్జెన్సీ తెచ్చిన ప్రధాని అంటే ప్రజలు అందరికీ గుర్తుకు వచ్చే పేరు ఇందిరా గాంధీ. అయితే... బసు అనేది బెంగాలీ పేరు. ఆవిడను ఇందిరా గాంధీ అంటే 'మయసభ' టీమ్ అసలు ఒప్పుకోదు. ఇందిరా గాంధీ ఇద్దరు కుమారుల్లో తొలుత సంజయ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత రాజీవ్ వచ్చారు. వాళ్ళిద్దరి క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి? ఐరావతి బసుతో పాటు ప్రచారంలో కనిపించిన యువకుడు ఎవరు? అనేది చూడాలి. ప్రధానిగా దివ్యా దత్తా నటించారు. 

Also Read: చంద్రబాబు Vs వైఎస్సార్ లైఫ్ స్టోరీ కాదు - 'మయసభ' సిరీస్‌పై డైరెక్టర్ దేవా కట్టాతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా పేరు బలమైన నాయకుడిగా వినిపించింది. ఆయన పాత్ర ఎవరు చేశారు? అనే ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. రాయలసీమలో రాజకీయాల్లో నక్సలిజం, ఫ్యాక్షన్ నుంచి నాయకుడిగా ఎదిగిన పరిటాల రవిని సైతం చంద్రబాబు - రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో విస్మరించలేం. ఆ పాత్ర ఎవరు చేశారో? లెట్స్ వెయిట్ అండ్ సి. నాజర్, తాన్యా రవిచందర్, శ్రీకాంత్ భారత్ తదితరులు సైతం 'మయసభ'లో ఉన్నారు. ట్రైలర్ చూస్తే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళ ఏయే పాత్రల్లో కనిపిస్తారో చూడాలి.

Also Read: పవన్ లుక్స్‌ కాదు... సుజీత్ హింట్స్... 'ఓజీ' పాట 'ఫైర్ స్ట్రోమ్‌'లో హిడెన్ డీటెయిల్స్... వీటిని గమనించారా?