Watch Mayasabha Web Series Teaser: రోడ్డు మీద లారీ వెళుతోంది. అందులో కూర్చున్న ఒకరు 'మడక దున్నే కులంలో పుట్టిన వాడికి నీకెందుకు అబ్బే రాజకీయం' అన్నారు. డ్రైవింగ్ చేసే యువకుడు 'వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి నీకెందుకయ్యా వైద్యం' అని బదులు ఇచ్చారు. చూస్తే ఇద్దరి మధ్య గొడవ అయ్యేలా ఉందని అనుకుంటాం. కానీ, ఆ సంభాషణ తర్వాత వాళ్లిద్దరూ నవ్వుకుంటారు. ఆ లారీ డ్రైవ్ చేసింది సీబీఎన్. లారీలో ఉన్నది వైయస్సార్. వాళ్లిద్దరి జీవితాల ఆధారంగా రూపొందిన సోనీలివ్ ఒరిజినల్ సిరీస్ 'మయసభ'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
ఇద్దరు స్నేహితులు... రాజకీయ శత్రువులు!'మయసభ' టీజర్ చూస్తే... సీబీఎన్ పాత్రలో ఆది పినిశెట్టి, వైయస్సార్ పాత్రలో చైతన్య రావు నటించినట్లు అర్థం అవుతోంది. అయితే... ఆ పేర్లు వాడలేదు. కాకర్ల కృష్ణమ నాయుడిగా ఆది పినిశెట్టి, ఎం.ఎస్. రామిరెడ్డిగా చైతన్య రావు, ఐరావతి బసుగా దివ్య దత్తా కనిపించనున్నారు. రైజ్ ఆఫ్ ది టైటాన్స్... అనేది ఈ సిరీస్ ఉపశీర్షిక. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా క్రియేట్ చేశారు. ఆయనతో పాటు కిరణ్ జయ కుమార్ దర్శకత్వం వహించారు. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు.
Mayasabha Web Series Streaming Date: సోనీలివ్ ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ ఇది. ఆగస్టు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వీక్షకుల ముందుకు రానుంది. రాజకీయాలలోకి వచ్చిన ఇద్దరు స్నేహితులు ఎలా శత్రువులుగా మారారు? వాళ్ళిద్దరి మధ్య దూరం ఎలా పెరిగింది? ఏమైంది? అనేది సిరీస్. 'మయసభ' టీజర్ చూస్తే... ఇంటెన్స్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. లక్ష్మీపార్వతి పెత్తనాన్ని సహించని చంద్రబాబు నాయుడు, పార్టీని తన చేతుల్లోకి తీసుకునే ఘట్టం నుంచి సిరీస్ ప్రారంభం కావచ్చు. టీజర్ ఫస్ట్ డైలాగ్ చూస్తే అలాగే ఉంది. 'అర్జంటుగా బయలుదేరి రేపు ఉదయం హైదరాబాద్ ఆశ్రమ్ హోటల్‌కు వచ్చేయ్. పెద్దాయన రేపు పార్టీ నుంచి సస్పెండ్ చేయబోయే 35 మంది ఎమ్మెల్యేలలో నువ్వు కూడా ఉన్నావ్' అని ఫోనులు రావడంతో ముఖ్యమంత్రి ఆర్‌సీఆర్ (ఎన్టీఆర్)కి వ్యతిరేకంగా దాదాపు 160 మంది ఎమ్మెల్యేలు సమావేశం అవుతారు. నో కోపరేషన్ మూమెంట్ డిక్లేర్ చేస్తారు.
'ఏం జరుగుతుంది నాయుడు?' అని వైయస్సార్ ప్రశ్నిస్తే... 'కురుక్షేత్రం' అని బదులు ఇస్తారు సీబీఎన్. తర్వాత 'ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినావ్? ఫ్రెండ్‌గానా? ప్రత్యర్థిగానా?' అని అడిగితే... ''ఇది చావో రేవో అర్ధం కావడం లేదు రెడ్డి... 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు' అని బదులు ఇస్తారు. ఆ తర్వాత 'స్నేహితుడిగా ఒకటిగా చెప్పు... ఈ ఉచ్చు నుంచి బయట పడతానా?' అని సీబీఎన్ అడిగితే... ''ఈ రోజు ఒకవేళ నువ్వు గెలిస్తే... ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణాన్ని నిన్ను ఓడించేంతవరకు వాడుతూ ఉంటాను'' అని వైయస్సార్ చెబుతాడు. టీజర్‌లో ప్రతి డైలాగ్ బాణంలా దూసుకొచ్చింది. సిరీస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.