పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత భాషా అడ్డంకులు తొలగిపోయాయి. అందులోనూ ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, జనాలు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను చూడటం అలవాటు చేసుకున్నారు.. కంటెంట్ బాగుంటే చాలు ఆదరిస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇతర భాషల చిత్రాల అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ 'RDX' (రాబర్ట్ డోని జేవియర్). మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం.. తాజాగా డిజిటల్ వేదిక మీదకు వచ్చేసింది.
షేన్ నిగమ్, ఆంటోని వర్గీస్, నీరజ్ మాధవ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఆర్‌డిఎక్స్' (RDX). ఇందులో మహిమా నంబియార్, ఐమా సెబాస్టియ్, లాల్, బాబు ఆంటోని, మాలా పార్వతి కీలక పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కించిన ఈ సినిమా, ఆగస్ట్ 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 8 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రూ. 84 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీని దెబ్బకు అదే రోజు వచ్చిన దుల్కర్ సల్మాన్ 'కింగ్ ఆఫ్ కొత్త', నివీన్ పౌలీ 'రామచంద్ర బాస్ & కో' సినిమాలు కూడా సైడ్ అయిపోయాయి. అలాంటి సెన్సేషనల్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' సినిమాని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 24) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మూవీ వచ్చే వారం ఓటీటీలోకి వస్తుందని అందరూ భావిస్తుండగా, అంతకంటే ముందుగా సరిగ్గా నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ చేసారు. ప్రస్తుతానికి ఈ మూవీని మలయాళంలో మాత్రమే ప్రసారం చేస్తుండగా.. డబ్బింగ్ వెర్షన్‌లను ఇంకా స్ట్రీమింగ్ చేయలేదు.
RDX సినిమాని మలయాళంతో పాటుగా మిగతా భాషల డబ్బింగ్ వెర్షన్‌లను స్ట్రీమింగ్ చేస్తారని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తెలుగుతో సహా ఇతర భాషలలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రేక్షకులకు హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగానే ఈ మూవీ తెలుగు వెర్షన్ ను స్ట్రీమింగ్ పెట్టే ఛాన్స్ ఉంది. కాకపోతే అప్పటి దాకా వెయిట్ చేయలేని వాళ్ళు సబ్ టైటిల్స్ తో ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూసేయ్యెచ్చు.
RDX కథేంటంటే..?
రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోని వర్గీస్) అన్నదమ్ములు. వీళ్ల ఫ్రెండ్ గ్జేవియర్ (నీరజ్ మాధవ్). స్థానిక అకాడమీలో వారి మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ బలంగా టీమ్ ని తయారు చేస్తారు. కానీ ప్రత్యర్థి గ్యాంగ్ తో ఏడ్పడిన గొడవ, కొన్ని సంఘటనలు వారిని విడదీస్తాయి. ఆ ముగ్గురు విడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మళ్ళీ కలిసారా లేదా? తమ శత్రువులపై పగ తీర్చుకున్నారా లేదా? అనేది RDX స్టోరీ. కామెడీ, యాక్షన్, ఎమోషన్, ఫ్రెండ్ షిప్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు కలబోసి ఒక హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దారు. వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ పై సోఫియా పాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సిఎస్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.
Also Read: సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial