Miss Perfect Trailer: చాలామంది నటీనటులు సినిమాలతో ఎంత బిజీగా ఉంటున్నారో.. అదే విధంగా ఓటీటీ కంటెంట్‌తో కూడా బిజీ అవుతున్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఇప్పటికే ఓటీటీలో గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది. ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన లావణ్య.. ఇప్పుడు హాట్‌స్టార్‌లో విడుదల కానున్న ‘మిస్ పర్ఫెక్ట్‌’ అనే వెబ్ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే విడుదలయిన ‘మిస్ పర్ఫెక్ట్’ టీజర్.. ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదలయ్యింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ‘మిస్ పర్ఫెక్ట్’ స్టోరీపై ఒక క్లారిటీ వచ్చేస్తోంది. ఇందులో లావణ్యకు జోడీగా బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటిస్తున్నాడు.


ఎంటర్‌టైనింగ్‌గా ట్రైలర్..


తనకు శుభ్రత అంటే ఎంత ఇష్టమో లావణ్య త్రిపాఠి చెప్పడంతో ‘మిస్ పర్ఫెక్ట్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో లావణ్యకు ఓసీడీ ఉన్నట్టుగా టీజర్‌లోనే చూపించిన మేకర్స్.. ట్రైలర్‌లో కూడా అదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇక అలాంటి లావణ్య ఒకానొక సందర్భంలో అనుకోకుండా అభిజీత్ ఫ్లాట్‌కు వెళ్తుంది. అక్కడ తను పనిమనిషి అని కమిట్ అవుతుంది. అదే క్రమంలో రోజు అభిజీత్ ఫ్లాట్‌కు వెళ్లి శుభ్రం చేస్తూ.. పూర్తిగా పనిమనిషిగా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత కథలో ఎలాంటి మలుపులు ఉంటాయన్నది ‘మిస్ పర్ఫెక్ట్’ విడుదల తర్వాత చూడాల్సిందే. ఇక ఈ సిరీస్‌లో లావణ్య పాత్ర పేరు కూడా లావణ్య కాగా.. రోహిత్ అనే పాత్రలో అభిజీత్ కనిపించనున్నాడు.


తెలుగు సినిమాలు లేవు..



‘మిస్ పర్ఫెక్ట్’లో లావణ్య త్రిపాఠి, అభిజీత్‌తో పాటు అభిజ్ఞ, హర్ష వర్ధన్, మహేశ్ విట్టా, సునైనా లాంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా విడుదలయిన ట్రైలర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. చాలాకాలం తర్వాత లావణ్యను స్క్రీన్‌పై చూసే అవకాశం రావడంతో తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 2022లో ‘హ్యాపీ బర్త్‌డే’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చివరిసారిగా కనిపించి అలరించింది లావణ్య. ఇక 2023లో వరుణ్ తేజ్‌తో పెళ్లిలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం లావణ్య చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. ‘తనాల్’ అనే ఒక తమిళ చిత్రం మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.






పెళ్లి తర్వాత మొదటిసారిగా..


అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. విశ్వక్ ఖండేరావు దీనికి దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ ఆర్ విహారీ దీనికి సంగీతాన్ని అందించాడు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన లావణ్య.. మొదటిగా టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ యాక్టింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తనకు ‘అందాల రాక్షసి’లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. అప్పటినుండి తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగులోనే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొని సెటిల్ అయిపోయింది. ఇక మెగా హీరో వరుణ్ తేజ్‌తో ‘మిస్టర్’, ‘అంతరిక్షం’లాంటి సినిమాల్లో కలిసి నటించింది ఈ భామ. అదే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 2023లో పెద్దల సమ్మతంతో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత లావణ్య చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో ‘మిస్ పర్ఫెక్ట్’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరీ 2 నుండి ‘మిస్ పర్ఫెక్ట్’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది.


Also Read: ‘అయాలన్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడంటే?