Vishwak Sen's Laila Movie OTT Streaming On Amazon Prime And Aha: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), ఆకాంక్ష శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన 'లైలా' (Laila) వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో విడుదలై నెల రోజులైన కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి 'ఆహా' (Aha) ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలుత 'అమెజాన్ ప్రైమ్' (Amazon Prime Video) ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం సాగినా తాజాగా.. 'ఆహా' సైతం డిజిటల్ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో లైలా మూవీ స్ట్రీమింగ్‌పై 'ఆహా' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీని రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించారు. ఆమె ఈ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. 

విడుదలకు ముందే వివాదాలు

అయితే, విశ్వక్ 'లైలా' మూవీ విడుదలకు ముందే వివాదాలు మూటగట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఆయన తన క్యారెక్టర్ గురించి చెబుతూ చేసిన కామెంట్స్ తమ పార్టీని టార్గెట్ చేసేలా ఉన్నాయంటూ వైసీపీ ఫ్యాన్స్ 'బాయ్ కాట్ లైలా' అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. దీనిపై స్వయంగా హీరో విశ్వక్, నిర్మాత సాహు గారపాటి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చారు. అనంతరం నటుడు పృథ్వీరాజ్ సైతం తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత సినిమా విడుదల కాగా.. లేడీ గెటప్‌లో విశ్వక్ వన్ మ్యాన్ షో చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయారు. మూవీలో ఎక్కువ శాతం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెట్టినట్లు విమర్శలు వచ్చాయి.

Also Read: పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - 'ఖాకీ 2' వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారా.?, ఆ వార్తల్లో నిజమెంత!

సారీ చెప్పిన విశ్వక్ సేన్

ఈ మూవీ రిజల్ట్‌పై హీరో  విశ్వక్ ఓ లేఖ సైతం విడుదల చేశారు. ఇక నుంచి ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీస్తానని.. క్లాస్ అయినా మాస్ అయినా అసభ్యత అనేది ఉండదని స్పష్టం చేశారు. తన చివరి సినిమాపై నిర్మాణాత్మక విమర్శను అంగీకరిస్తున్నానని.. తనను నమ్మి, తన ప్రయాణానికి మద్దతిచ్చిన అభిమానులు, తనకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి ఆయన హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. విశ్వక్ ప్రస్తుతం అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేస్తున్నారు.

Also Read: నయనతార రూల్ మార్చేశారా.? - కొత్త సినిమా ప్రారంభంలో నయన్, ఆమేనా అంటూ నెటిజన్లు షాక్