Best Horror Movies On OTT: నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఏ భాషలో అయినా ఇలాంటి హారర్ సినిమాలు చూస్తామని సిద్ధంగా ఉండేవారి కోసం ‘కుయాంగ్’ (Kuyang) మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఇది ఒక ఇండోనేషినయన్ హారర్ మూవీ. ఇండోనేషియాలో ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘కుయాంగ్’. కుయాంగ్ అంటే దెయ్యం. అసలు సరిగ్గా రోడ్డు సదుపాయం కూడా లేని ఒక ఊరికి వెళ్లి భార్యాభర్తలు ఎలా ఇరుక్కుపోతారు అనేది ఈ సినిమా కథ.


కథ..


‘కుయాంగ్’ కథ విషయానికొస్తే.. బీమో (దిమాస్ ఆదిత్య), శ్రీ (అలీస్సా అబిదిన్) భార్యాభర్తలు. వారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. అప్పుడే రోడ్డు కూడా లేని ఒక ఊరిలో టీచర్‌గా పనిచేయడానికి బీమోకు అవకాశం వస్తుంది. జీతం ఎక్కువగా ఉండడంతో తమ ఆర్థిక సమస్యలు తీరిపోతాయని బీమో.. ఆ ఉద్యోగానికి ఒప్పుకుంటాడు. కానీ తనను ఒంటరిగా వెళ్లనివ్వడం శ్రీకు నచ్చదు. అందుకే తను కూడా భర్తతో పాటు ఆ గ్రామానికి బయల్దేరుతుంది. వారిని గ్రామంలోకి తీసుకెళ్లడం కోసం ఒక ట్రావెల్ ఏజెంట్‌తో పాటు డ్రైవర్ వస్తాడు. దారిమధ్యలో శ్రీకు కారు కిటికీలో నుంచి ఒక ఎగురుతున్న తల కనిపిస్తుంది. అది చూసి భయపడిన శ్రీ గట్టిగా అరుస్తుంది. దీంతో డ్రైవర్ కారు ఆపేస్తాడు. ఆ కారు మళ్లీ స్టార్ట్ అవ్వదు. అదే సమయంలో దూరం నుంచి ఒక వెలుగు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే ఒక శవపేటిక చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంది. అది వారిని వెంటాడుతుంది. అందరూ మళ్లీ కారు ఎక్కేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు.


చెట్టుకు శవపేటిక వేలాడడం చూసిన బీమో, శ్రీ భయపడతారు. అయితే అది ఆ ఊరిలో ఆచారమని, చనిపోయిన వ్యక్తులను శవపేటికల్లో పెట్టి చెట్లకు వేలాడదీస్తారని డ్రైవర్.. వారికి వివరిస్తాడు. అంతే కాకుండా ఆ ఊరిలో చాలామంది చేతబడి చేస్తారని చెప్తాడు. శ్రీకు కనిపించిన తలను ఆ ఊరిలో కుయాంగ్ అని పిలుస్తారని అంటాడు. ఇదంతా తెలిసినా కూడా బీమో, శ్రీ.. అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతారు. ఆ ఊరికి వెళ్లడానికి కేవలం ఒక్క పడవ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బయటవారు ఎవ్వరూ ఆ ఊరిలోకి రారు. అలా వచ్చిన బీమో, శ్రీను చూసి అక్కడవారంతా ఆశ్చర్యపోతారు. ఆ ఊరిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి తంబి (ఎల్లీ డీ లూథన్).. బీమో, శ్రీలను గమనిస్తూ ఉంటుంది. తను చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అయితే తనే కుయాంగ్ అని ప్రజలంతా అనుకుంటూ ఉంటారు.


మరుసటి రోజు బీమోతో పాటు శ్రీ కూడా ఆ గ్రామంలోని పిల్లలకు టీచర్‌గా వెళ్తుంది. ఒక పెద్ద వరద వల్ల ఆ గ్రామంలోని స్కూల్ మొత్తం మునిగిపోయి చాలామంది స్టూడెంట్స్ చనిపోతారు. ఇప్పటికీ ఆ స్టూడెంట్స్ ఆత్మలు అక్కడే ఉన్నాయని చాలామంది నమ్ముతారు. అందరూ చెప్పినట్టుగానే శ్రీ క్లాస్‌లో ఉండే మయంగ్ (మెస్సీ గస్తీ) అనే అమ్మాయికి దెయ్యం పడుతుంది. దానిని బీమో కూడా చూస్తాడు. దాని గురించి ఆ స్కూల్ ప్రిన్సిపల్‌కు, గ్రామ సెక్రటరీకి చెప్తారు. దీంతో వారు మీనా (పుత్రీ అయుధ్య) అనే మంత్రగత్తెను తీసుకొస్తారు. ఆ మంత్రగత్తె శ్రీను చూసి తను ప్రెగ్నెంట్‌గా ఉందని, తన కడుపులోని బిడ్డను కుయాంగ్ ఎత్తికెళ్లిపోయి బలిచ్చి శక్తి పొందాలనుకుంటుందని చెప్తుంది. దీంతో తంబినే కుయాంగ్ అని నమ్మిన బీమో.. తనను చంపడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుంది? శ్రీను బీమో కాపాడుకోగలడా? వారిద్దరూ ఆ ఊరి నుంచి పారిపోగలరా? అనేది తెరపై చూడాల్సిన కథ.



ఉలిక్కిపడే అంశాలు తక్కువే..


‘కుయాంగ్’ సినిమాలో చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. కాబట్టి నటీనటులు ఎవరో తెలియకపోయినా.. ఆ పాత్రలు మాత్రం ప్రేక్షకులు రిజిస్టర్ అయిపోతాయి. అందులో అందరి నటన బాగుంటుంది. హారర్ మూవీ అయినా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడే అంశాలు ఇందులో చాలా తక్కువగానే ఉంటాయి. కానీ చివర్లో ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. ఒక డీసెంట్ అండ్ డిఫరెంట్ హారర్ మూవీ ట్రై చేయాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ‘కుయాంగ్’ను ట్రై చేయవచ్చు.


Also Read: శవాలతో తల్లీకూతుళ్ల సావాసం - ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ మూవీ గురించి తెలుసా?