Kobali Web Series : ప్రతి వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే కొత్త వెబ్ సిరీస్ ల అప్డేట్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఓ వెబ్ సిరీస్ ని తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతున్నాం అంటూ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ టైటిల్ గతంలో పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ అనుకున్నా మూవీ టైటిల్ కావడం విశేషం.
పవన్ - త్రివిక్రమ్ కాంబోలో అటకెక్కిన ప్రాజెక్టు
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'కోబలి' పేరుతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మూవీ తీయాలనుకున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అప్పట్లోనే త్రివిక్రమ్ రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రాబోతుందని ప్రకటించారు కూడా. అంతేకాకుండా సినిమాలో హీరోయిన్, పాటలు లాంటివి లేకుండా 45 నిమిషాల రన్ టైమ్ తో ప్రయోగాత్మకంగా త్రివిక్రమ్ తెరకెక్కించాలని భావించినట్టు టాక్ నడిచింది. ఇది 2014 నాటి మాట. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ ఎన్నికలతో బిజీ కావడం వంటి కారణాలతో పాటు పలు అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది. దీంతో దాన్ని పక్కన పెట్టి 'అజ్ఞాతవాసి' అనే సినిమాను తెరపైకి తీసుకొచ్చారు పవన్ - త్రివిక్రమ్. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసిన అదే టైటిల్ తో తెలుగులో ఓ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది.
ఓటీటీలోకి 'కోబలి'...
తాజాగా 'కోబలి' అనే టైటిల్ తో వస్తున్న వెబ్ సిరీస్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. టైటిల్ తో పాటు పోస్టర్ ను రిలీజ్ చేసి విషయాన్ని వెల్లడించారు. ఈ సిరీస్లో రవి ప్రకాష్, శ్రీ తేజ్ ఇందులో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అయితే తాజాగా ఓటీటీలఓ త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది హాట్ స్టార్. దీనికి సంబంధించి అఫిషియల్ గా ఓ పోస్టర్ ను రిలీజ్ చేయగా, పోస్టర్లో నటీనటుల డీటైల్స్ ను సస్పెన్స్ లో ఉంచారు. కేవలం రక్తపు మరకలు ఉన్న కత్తిని, ఆ కత్తిలోనే సినిమాలోని కీలక పాత్రధారుల ముఖాలను చూపించారు. ఈ పోస్టర్ ను "రక్తపాతానికి సిద్ధం అవ్వండి" అనే క్యాప్షన్ తో వదిలారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... పవన్ - త్రివిక్రమ్ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో అనుకున్నారు. ఇక ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్న హాట్ స్టార్ ఒరిజినల్ సిరీస్ 'కోబలి' కూడా రాయలసీమ బ్యాగ్రౌండ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే హాట్ స్టార్ ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?