Vishnu Manchu's Kannappa OTT Streaming On Amazon Prime Video: విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ డివోషనల్ మూవీ 'కన్నప్ప'. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు విష్ణు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'కన్నప్ప' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా... ఈ నెల 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'త్యాగం, ఇతిహాసం, స్ఫూర్తి. దైవత్వానికి సాక్ష్యం. 'కన్నప్ప' ప్రైమ్ వీడియోలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. హర హర మహాదేవ్, హర ఘర్ మహాదేవ్' అంటూ విష్ణు మంచు 'X'లో వెల్లడించారు.
ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా... తిన్నడి పాత్రలో విష్ణు మనోజ్ అద్భుతంగా నటించారు. ఆయన సరసన ప్రీతి ముకుందన్ నటించారు. మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు, రుద్రుడిగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్, కిరాతగా మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటే శరత్ కుమార్, శివబాలాజీ, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీస్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించారు. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ రాబట్టింది.
స్టోరీ ఏంటంటే?
అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు (విష్ణు మంచు) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అల్లారుముద్దుగా పెంచుతాడు తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్). చిన్నప్పుడు తన గూడెంలో జరిగిన ఓ సంఘటనతో దేవుడంటే ద్వేషం పెంచుకుంటాడు తిన్నడు. చుట్టుపక్కల ఏ ఆపద వచ్చినా తన విలు విద్యా ప్రావీణ్యంతో అండగా నిలుస్తాడు తిన్నడు. అయితే, ఆ గూడేనికే కాకుండా చుట్టుపక్కల గూడేలకు కూడా ఓ ఆపద రాబోతుందని వారికి తెలుస్తుంది.
ఆనవాయితీగా వస్తోన్న ఆచారం ప్రకారం ఆపద నుంచి బయటపడాలంటే అమ్మోరికి ఎవరో ఒకరిని బలి ఇవ్వాలని అనుకుంటారు గూడెం పెద్దలు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తిన్నడిని గూడెం నుంచి బహిష్కరిస్తారు. అయితే, అప్పటికే తిన్నడికి మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్) అతనితో పాటే బయటకు వెళ్తుంది. అసలు ఆ గూడేనికి వచ్చిన ఆపద ఏంటి? గూడెం నుంచి బయటకు వెళ్లిన తిన్నడు గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? తిన్నడికి రుద్రుడు (ప్రభాస్) చూపించిన దారి ఏంటి? శివుని కోసం తిన్నడు చేసిన త్యాగం ఏంటి? ఎవరి చూపూ పడకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తోన్న మహాదేవశాస్త్రి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.