క్రైమ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌... ఈ మూడు కలగలిపిన మాంచి సినిమా ఒకటుంటే చెప్పు - ఈ వీకెండ్‌లో చూసేద్దామని ఎవరన్నా ఫ్రెండ్‌ మిమ్మల్ని అడిగారా? లేదంటే మీరే ఎవరిని అయినా అడిగారా? అయితే మీకో మంచి సజెషన్‌. కన్నడనాట ఫిబ్రవరిలో విడుదలై భారీ విజయం అందుకున్న ఓ చిన్న సినిమాను చూడండి. ఆ సినిమా పేరు 'శాఖాహారి'. ఆహా ఓటీటీలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.


శాఖాహారి... మాంచి మర్డర్ మిస్టరీ!
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇప్పటికే కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతున్న 'శాఖాహారి' సినిమా తెలుగు వెర్షన్‌ను 'ఆహా'లో తాజాగా తీసుకు వచ్చారు. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన 'శాఖాహారి' మర్డర్ మిస్టరీ. ఇందులో రంగాయన రఘు ప్రధాన పాత్రధారి. గోపాలకృష్ణ దేశ్ పాండే, వినయ్, నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ ఇతర తారాగణం. ఇక సినిమా ఆద్యంతం సస్పెన్స్ అంశాలతో నింపేశారు దర్శకుడు.  


తీర్థహళ్లి చుట్టూ తిరిగే కథ... 
తీర్థహళ్లి అనే కొండ పట్టణంలో జరిగే కొన్ని సంఘటనల చుట్టూ 'శాఖాహారి' సినిమా తిరుగుతుంది. అక్కడి ఓ శాఖాహార హోటల్‌లో సినిమా కథంతా ఎక్కువగా నడుస్తుంది. అందులో వంట చేసే సుబ్బన్నగా హీరో రంగాయన రఘు కనిపిస్తారు. పోలీస్‌ ఆఫీసర్‌గా గోపాల్‌కృష్ణ దేశ్‌పాండే నటించారు. థ్రిల్లర్‌ సినిమాలకు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, సంగీతం కీలకం అని చెప్పొచ్చు. ఆ పనులను సినిమాటోగ్రాఫర్‌ విశ్వజిత్ రావు, ఎడిటర్‌ శశాంక్ నారాయణ్, సంగీత దర్శకుడు మయూని అంబేకల్లు చక్కగా నిర్వర్తించారు అని చెప్పాలి.  


తెలుగు నేటివిటీకి సినిమా దగ్గరగా ఉండేలా డబ్బింగ్ విషయంలో అనువాద హక్కులు తీసుకున్న నిర్మాత జాగ్రత్త వహించారు. తెలుగు ప్రేక్షకులకు తన విలక్షణమైన గొంతు, నటనతో సుపరిచితుడు అయిన గోపరాజు రమణతో  హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. అది కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. మీకూ ఆసక్తి ఉంటే ఆహాలో సినిమా మీద ఓ లుక్కేయండి మరి. 


రఘుకు అవార్డులే అవార్డులు
మీరు సినిమా చూసే ముందు సినిమా కీలక పాత్రధారి రంగాయన రఘు గురించి చెప్పాలి. ఇప్పటికే వందకుపైగా సినిమాల్లో నటించిన ఆయనకు కన్నడ స్టేట్‌ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, సైమా అవార్డులు.. ఇలా ఒక్కటేంటి ఎన్నో అవార్డులు దక్కాయి. ఆయన ఈ ఏడాది ఇప్పటివరకు 11 సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ లెక్కన ఎంతటి బిజీ నటుడో, ఎంతటి గొప్ప నటుడో చెప్పేయొచ్చు.


Also Read: 'సోలో బాయ్'తో హీరోగా బిగ్ బాస్ గౌతమ్ - టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ వేస్తే 30 వేలు... ఛాలెంజ్‌కి రెడీనా?


ఈ సినిమా విడుదలకు ముందే రఘుకు అభినయాసుర అనే బిరుదుతో రఘను సత్కరించారు. మరి ఆ నటుడి వైవిధ్యం ఏంటో ఈ సినిమాతో మీరూ చూసేయొచ్చు. ఇక 'శాఖాహారి' సినిమా కన్నడ వెర్షన్‌ సంగతి చూస్తే..  ఈ ఏడాది ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైంది. బెంగళూరులో కొన్ని థియేటర్లలో 50 రోజులకుపైగా ప్రదర్శించారు కూడా.


Also Read: ప్రభాస్ బెస్ట్ అని అర్షద్ ఫస్ట్ డే ట్వీట్ చేసేలా 'కల్కి 2' తీస్తా - లేటెస్ట్ కాంట్రవర్సీపై నాగ్ అశ్విన్ రియాక్షన్