టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'జీకర్దా'(Jee Karda). తమన్నా హిందీలో చేస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. జూన్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అరునిమా శర్మ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ని మద్ధోక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించారు. ఇక ఈరోజు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో ఓ ఏడుగురు ఫ్రెండ్స్ జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి అనే పాయింట్ ని ప్రధానంగా చూపించారు. ఫ్రెండ్స్ మధ్య బాండింగ్, ఫన్, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ ఈ ట్రైలర్ ల్ చూడొచ్చు. ఇక ట్రైలర్ ప్రకారం ఓ ఏడుగురు స్నేహితులు తమకి 30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తమ జీవితాలు ఓ కొలిక్కి వస్తాయని అనుకుంటారు. కానీ తమకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత తాము అనుకున్న దానికి భిన్నంగా జీవితం ఉందని గ్రహిస్తారు.


ఈ 30 ఏళ్ల జీవితంలో అందరూ కలిసి స్వేచ్ఛగా జీవిస్తారు. ప్రేమించుకుంటారు. కలిసి తప్పులు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల హృదయాలను సైతం  బద్దలు కొట్టుకుంటారు. ఇలా అన్ని ఎమోషన్స్ ద్వారా నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటనేది తెలుసుకుంటారు. అంతేకాదు అనుబంధాలు అనేవి అసంపూర్ణమైనవి అని అర్థం చేసుకుంటారు. జీవితం చాలా కఠినమైనదనే వాస్తవాన్ని గ్రహిస్తారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో ఏడుగురు బాల్య స్నేహితులుగా తమన్నా, ఆషిమ్ గులాటి, అన్యాసింగ్, హుస్సేన్ దలాల్, సాయన్ బెనర్జీ సుహైల్ నయ్యర్, సంవేదన సువల్క నటించగగా.. సిమోన్ సింగ్, మల్హర్ థాకర్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో తమన్నా 'లావణ్య' అనే పాత్రను పోషించింది. ఇక ట్రైలర్లో లావణ్య (తమన్నా) కి ప్రపోజ్ చేస్తాడు రిషబ్ (సుహైల్). ఇక వాళ్ల పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు మిగతా ఐదుగురు స్నేహితులు హాజరవుతారు. కొన్ని ఘటనలతో వారి అనుబంధాలు అనూహ్యమైన మలుపును తీసుకుంటాయి.


మరి వాళ్ళ జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అయితే ఆకట్టుకునే విధంగానే ఉంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటివరకు కనిపించని బోల్డ్ రోల్ లో తమన్నా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లో సుహేల్ తో కొన్ని బోల్డ్ సీన్స్ లో కనిపించింది తమన్నా. ఎలాగో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఇలాంటి సీన్స్ కి మంచి రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి ఈ 'జీకర్దా' వెబ్ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదివరకు '11th అవర్',  'నంబర్ స్టోరీ' వంటి సౌత్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తమన్నా ఈ 'జీకర్దా' వెబ్ సిరీస్ తో నార్త్ ఆడియన్స్ ని ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.


కాగా తెలుగులో తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడిగా 'బోలాశంకర్' సినిమాలో నటిస్తోంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'వేదాళం' అనే సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.