టీటీ కోసం సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తున్న దర్శకుల జాబితాలో మహి వి. రాఘవ్ కూడా చేరారు. ఇప్పటికే ఆయన ‘సేవ్‌ ద టైగర్స్‌’వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు. ఈ సిరీస్ కు ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇంట్లో భార్య భర్త మధ్య జరిగే గొడవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలై చక్కటి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన మరో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.  


పరిమితికి మించిన బోల్డ్ కంటెంట్


మహి వి. రాఘవ్  విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు. 'పాఠశాల'తో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తీసిన 'ఆనందో బ్రహ్మ', ముఖ్యంగా 'యాత్ర'తో పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దర్శకుడు ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. అదే ‘సైతాన్‌’. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే, పూర్తి స్థాయిలో బూతులు, పగలు, ప్రతీకారాలు, రక్తపాతాల చుట్టే తిరిగింది. బోల్డ్ కంటెంట్ పరిమితికి మించి ఉంది. మహి వి. రాఘవ్ తెరకెక్కిస్తున్నఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడిగా మహి వి. రాఘవ్ తీసిన చిత్రాలకు ఈ వెబ్ సిరీస్ భిన్నంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.



'సైతాన్' వెబ్ సిరీస్‌లో సాయి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్ చేశారు. 'ప్రియురాలు' సినిమాలో ఆమె హీరోయిన్. అంతకు ముందు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'లో అఖిల్ అక్కినేని స్నేహితురాలిగా నటించారు. ఓటీటీలో విడుదలైన 'మా ఊరి పొలిమేర' సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించారు. ఇంకా 'ద బేకర్ అండ్ ద బ్యూటీ', 'కుబూల్ హై', 'అన్యాస్ ట్యుటోరియల్' వెబ్ సిరీస్‌ల‌లో కీలక పాత్రల్లో కనిపించారు. ఈ  క్రైమ్ సిరీస్ ఈ నెల 15న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో  స్ట్రీమింగ్ కు రానుంది.






కరోనా తర్వాత ఓటీటీలకు పెరిగిన ఆదరణ


వాస్తవానికి కరోనా తర్వాత ఓటీటీలకు మంచి ఆదరణ పెరిగింది. ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమా టీవీలో చూడాలంటే కనీసం మూడు, నాలుగు నెలల సమయం పట్టేది. కానీ, ఇప్పుడు ఒకటి, రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సినీ అభిమానులు సైతం ఓటీటీలకు ఎప్పువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలకు తోడు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. మంచి కంటెంట్  ఉన్న సిరీస్ ను ప్రేక్షకులు గంటల తరబడి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు టాప్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  వెబ్ సిరీస్ ల ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.