Rajeev Kanakala's HomeTown Web Series Trailer Unveiled: ప్రముఖ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), సీనియర్ యాంకర్ ఝాన్సీ (Jhansi) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్ 'హోమ్ టౌన్' (HomeTown). శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించగా.. '90స్' వెబ్ సిరీస్ నిర్మాత నవీన్ మేడారం ఈ సిరీస్ నిర్మించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా నవ్వులతో పాటు ఎమోషన్ పండించింది. తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు.

ఓ తండ్రి కల.. కొడుకు ఏం చేశాడంటే..?

ఓ మధ్య తరగతి తండ్రి తన కొడుకును ఫారిన్ పంపించాలని కలలు కనడం.. కొడుక్కి చదువుపై ఇంట్రెస్ట్ లేకపోవడం.. ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఆ కొడుకు చేసే అల్లరి, లవ్, ఫ్యామిలీ ఎమోషన్ అన్నీ కలిపి ప్రధానాంశంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ మధ్య తరగతి తండ్రిగా రాజీవ్ కనకాల తనదైన డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు. 'స్టూడియోపై నాకొచ్చేదే రూ.6 వేలు.. ఆ కటింగ్స్, ఈ కటింగ్స్ పోనూ మిగిలింది పిల్లల చదువులు, పాలు, బియ్యం, సరుకులు' అంటూ చెప్తుండగా.. ఈ లిస్ట్ నాక్కూడా తెలుసంటూ అతని భార్య చెప్పే తీరు నవ్వులు పూయిస్తోంది.

కొడుకును ఫారిన్ పంపించాలని తండ్రి భావిస్తుంటే.. కొడుకు వేరే దానిపై దృష్టి సారిస్తాడు. 'మనుషులను దూరం చేసే చదువులు మనకెందుకు' అంటూ ఝాన్సీ చెప్పే డైలాగ్ ఆలోచింపచేస్తుంది. ఇంతకూ ఆ తండ్రి కల నెరవేరిందా..?, కొడుకు ఫారిన్ వెళ్లాడా.?, ముగ్గురి స్నేహితుల కథేంటి.?, ఓ మధ్య తరగతి కుటుంబం కథ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

Also Read: ఓటీటీలో కామెడీ ఎంటర్‌టైనర్ - ఈ ఉగాదికి 'మజాకా' చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా.?

ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్

ఈ సిరీస్ 'ఆహా'లో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'నువ్వు నీ ఊరు వదిలి వెళ్లవచ్చు. కానీ జ్ఞాపకాలను ఎప్పుడైనా వదిలి వెళ్లగలవా? వీధులు, స్నేహాలు, అర్థరాత్రి కలలు శ్రీకాంత్ ప్రయాణం మనది కూడా.'. అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో కుటుంబ విలువలు, లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రజ్వల్ యద్మ, సాయిరాం, అనిరుద్, జ్యోతి కీలక పాత్రలు పోషించారు.

బాబు బాగా బిజీ', 'సిన్' వెబ్ సిరీస్, 'డెవిల్' సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ మేడారం.. '90స్' వెబ్ సిరీస్‌తో నిర్మాతగా వ్యవహరించారు. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఎమోషన్స్, బాల్యం, ఎడ్యుకేషన్, మంచి మెసేజ్‌తో కూడిన '90s' సిరీస్ మంచి సక్సెస్ అందుకుంది. ఆదిత్య హాసన్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా 'ఈటీవీ విన్' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు అదే నవీన్ మేడారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్ 'హోమ్ టౌన్'తో వస్తున్నారు.