The Boys Web Series Season 4: ఇంగ్లీష్‌లో సూపర్ హీరోలకు ఉండే క్రేజే వేరు. ఇప్పటికీ సూపర్ హీరోలకు పరిగణించే ఎన్నో క్యారెక్టర్లు హాలీవుడ్ నుండే పుట్టాయి. అయితే మామూలుగా సూపర్ హీరోలు అంటే ప్రపంచాన్ని కాపాడేవారు అయ్యింటారు. కానీ అలాంటి సూపర్ హీరోలే స్వార్థంతో ప్రపంచాన్ని దక్కించుకోవాలనుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి తెరకెక్కించిన వెబ్ సిరీసే ‘ది బాయ్స్’. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా ఆ ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ ముందుకు వచ్చిన ‘ది బాయ్స్’.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ‘ది బాయ్స్’ 4వ సీజన్‌కు సంబంధించిన తెలుగు టీజర్.. తెలుగు ఫ్యాన్స్ ముందుకు వచ్చింది.
‘ది బాయ్స్ 4 ’ తెలుగు టీజర్..
‘ది బాయ్స్’ సిరీస్‌లో మరోసారి హోమ్‌ల్యాండర్ పాత్రలో ఆంటోనీ స్టార్ ప్రేక్షకులను అలరించనున్నాడు. కార్ల్ అర్బన్, ఎరిన్ మోరియార్టి, కరెన్ ఫుకుహారా కూడా కూడా ‘ది బాయ్స్ 4’లో కనిపించనున్నారు. ముందు సీజన్స్‌లాగానే ‘ది బాయ్స్ 4’లో కూడా ఆంటోనీ స్టార్ డామినేషన్ కనిపించనుందని తెలుస్తోంది. హాలీవుడ్ సిరీస్ లవర్స్‌కు నచ్చే యాక్షన్, కామెడీ లాంటి ఎలిమేంట్స్ ‘ది బాయ్స్ 4’లో ఉంటాయని టీజర్ ద్వారా తెలిసేలా చేసింది టీమ్.
పుస్తకం ఆధారంగా..
గార్త్ ఎన్నీస్ రాసిన ‘ది బాయ్స్’ అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ముందుగా ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు దర్శకుడు ఆడమ్ మ్యాక్‌కే. కానీ ఆ తర్వాత పలు కారణాలు వల్ల ఈ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టాడు ఆడమ్. దీంతో కొన్నాళ్లు ఆ స్క్రిప్ట్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. 2017లో ఈ కథను సిరీస్‌గా డెవలప్ చేస్తున్నారని తెలుసుకున్న అమెజాన్ స్టూడియోస్.. సిరీస్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. అలా ముందుగా ఎన్నో కష్టాలు ఎదుర్కున్న ఈ స్క్రిప్ట్.. ఫైనల్‌గా ‘ది బాయ్స్’ అనే ఒక కామిక్ సిరీస్‌గా 2019 జులై 26న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయ్యింది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్‌ఫుల్ అవ్వడంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా రెండో సీజన్‌ను ప్రారంభించారు మేకర్స్.
అయిదు ఎపిసోడ్లతో..
2020 సెప్టెంబర్ 4న ‘ది బాయ్స్’ రెండో సీజన్ విడుదలయ్యింది. ఇక గతేడాది మూడో సిరీస్ కూడా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాగా.. ‘ది బాయ్స్ 4’ మాత్రం 2024లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘ది బాయ్స్ 4’ కోసం ఈ సిరీస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. దీని విడుదల తేదీ ఎప్పుడు అనే విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ‘ది బాయ్స్’ మునుపటి సీజన్స్‌లో పలు ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసిన ఫిల్ స్గ్రారిక్కియా.. ‘ది బాయ్స్ 4’లోని మొదటి ఎపిసోడ్ డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ‘ది బాయ్స్ 4’లో మొత్తం అయిదు ఎపిసోడ్లు ఉన్నట్టు సమాచారం. అయితే ‘ది బాయ్స్’ మునుపటి సీజన్స్ పెంచిన అంచనాలను ‘ది బాయ్స్ 4’ అందుకోగలుగుతుందేమో చూడాలి.
Also Read: బిగ్ బాస్ బ్యూటీకి ఇన్ స్టా షాక్, అకౌంట్ ను సస్పెండ్, కానీ..
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply