ఈ సంవత్సరం మార్చితో డిస్నీప్లస్ హాట్‌స్టార్, హెచ్‌బీవోల మధ్య ఒప్పందం ముగిసిపోయింది. దీంతో గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది వైర్, హౌజ్ ఆఫ్ ది డ్రాగన్, సక్సెషన్ వంటి టాప్ రేటెడ్ వెబ్ సిరీస్‌లు అన్నీ హాట్‌స్టార్ నుంచి వెళ్లిపోయాయి. ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా ఇప్పుడు జియో దక్కించుకుంది. ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ ఓటీటీ ప్లాట్‌ఫాం అయ్యే దిశగా జియో పావులు కదుపుతోంది.


హెచ్‌బీవో, వార్నర్ బ్రదర్స్ గ్రూపు కంటెంట్ త్వరలో జియో సినిమా యాప్‌లో ప్రత్యక్షం కానుందని సమాచారం. హెచ్‌బీవో మ్యాక్స్, డిస్కవరీ సంస్థలు కలిసిపోయి ‘మ్యాక్స్’ అనే ఓటీటీ ప్లాట్‌ఫాంగా ఏర్పడ్డాయి. దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఇందులో ఉండనుంది. మే నెల నుంచి ఈ కొత్త కంటెంట్‌ను జియో సినిమా యాప్‌లో చూడవచ్చు.


హౌజ్ ఆఫ్ ది డ్రాగన్, ది లాస్ట్ ఆఫ్ అజ్, యుఫోరియా, ది వైట్ లోటస్, సక్సెషన్ వంటి టాప్ రేటెడ్ సిరీస్‌లో చూడవచ్చు. మార్చి 31వ తేదీన ఈ కంటెంట్ మొత్తాన్ని డిస్నీప్లస్ హాట్‌స్టార్ నుంచి తొలగించారు. ఆ సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హక్కులను దక్కించుకోనుందని వార్తలు వచ్చాయి. కానీ సడెన్‌గా జియో సినిమా రంగంలోకి దిగింది.


పైన తెలిపిన కంటెంట్‌తో పాటు హ్యారీ పోటర్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, డీసీ యూనివర్స్ ఫ్రాంచైజీ సినిమాలు కూడా జియో సినిమాలో అందుబాటులోకి రానున్నాయి. ఐపీఎల్, మహిళల ప్రీమియర్ లీగ్ హక్కులు 2027 వరకు జియో వద్దనే ఉన్నాయి. ప్రస్తుతానికి జియో సినిమా ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ వసూలు చేయడం లేదు. అయితే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు కూడా బయటకు వచ్చాయి.


ప్రస్తుతానికి మూడు ప్లాన్లను ఇందులో లిస్ట్ చేశారు. వీటిలో అత్యంత చవకైనది అందరినీ ఆకర్షించేది డైలీ ప్లాన్. రోజుకు రూ.2 చెల్లించి ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి డైలీ ప్లాన్ అని పేరు పెట్టారు. దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. రెండు డివైస్‌ల్లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.


ఇక రెండోది వచ్చి గోల్డ్ ప్లాన్. దీని వ్యాలిడిటీ మూడు నెలలుగా ఉంది. రూ.99తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. డైలీ ప్లాన్ తరహాలోనే రెండు డివైస్‌ల్లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసే అవకాశం ఉంది. అయితే కంటెంట్ స్ట్రీమ్ ఎస్‌డీలోనా, హెచ్‌డీలోనా, 4కేలోనా అనేది తెలియరాలేదు.


దీంతో పాటు మూడో ప్లాటినం ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీని ధరను రూ.599గా నిర్ణయించారు. ఇది వార్షిక ప్లాన్. 12 నెలల పాటు దీని వ్యాలిడిటీ ఉండనుంది. ఈ ప్లాన్ డిస్క్రిప్షన్‌లో ‘యాడ్ ఫ్రీ’ అని పేర్కొన్నారు. అంటే పైన ఉన్న రెండు ప్లాన్లలో యాడ్లు వస్తాయి అనుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా కంటెంట్‌ను నాలుగు డివైస్‌ల్లో ఒకేసారి స్ట్రీమ్ కానుంది.


అయితే వీటి అసలు ధరలు వేరే అని, ఇవి ఆఫర్ ధరలు అని జియో అంటుంది. డైలీ ప్లాన్ అసలు ధర రూ.29 కాగా, ఆఫర్ కింద రూ.2కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గోల్డ్ ప్లాన్ అసలు ధర రూ.299 కాగా దీన్ని రూ.99కే అందిస్తున్నారు. ఇక ప్లాటినం ప్లాన్ అసలు ధర రూ.1,199 కాగా దీన్ని రూ.599కే అందిస్తున్నారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద తక్కువ ధరకు అందిస్తున్నారా లేకపోతే ఈ ధరలను చాలా కాలం పాటు కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.