Former Union Minister Smriti Irani To Make A Comeback As An Actress: కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. పాలిటిక్స్‌లోకి రాక ముందు ఆమె సినీ, సీరియల్ నటిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్మృతి ఇరానీ నటనకు దూరమయ్యారు.
సీరియల్‌లో నటిగా..
అయితే, మళ్లీ స్మృతి ఇరానీ నటిగా రాణించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమె ఓ సిరీస్ కోసం వర్క్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో బుల్లితెర వేదికగా టెలికాస్ట్ అయిన పలు సీరియళ్ల కోసం ఆమె వర్క్ చేశారు. ఈ క్రమంలోనే ఏక్తా కపూర్ రూపొందించిన 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ' అనే సీరియల్ నటించగా ఆమెకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో స్మృతి 'తులసి' అనే గృహిణి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. 2000 నుంచి 2008 వరకూ ఈ సీరియల్ సక్సెస్ ఫుల్‌గా రన్ అయ్యింది.
ఇప్పుడు సీరియల్ సిరీస్‌గా..
ఇప్పుడు ఈ సీరియల్‌నే సిరీస్‌గా తీసుకురావాలని ఏక్తాకపూర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ఎపిసోడ్స్ లేకుండా తక్కువ ఎపిసోడ్స్‌తోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. సీరియల్‌లో కీ రోల్స్ ప్లే చేసిన స్మృతి ఇరానీ, అమర్ ఉపాధ్యాయ్‌నే సిరీస్ కోసం కూడా తీసుకోవాలని ఆమె ఆలోచిస్తున్నారట. దీనిపై ఇప్పటికే వారిని సంప్రదించారని పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
ఏక్తా కపూర్ కోరిక మేరకు మరోసారి నటిగా ఎంట్రీ ఇచ్చేందుకు.. కెమెరా ముందు నటించేందుకు స్మృతి ఇరానీ అంగీకారం తెలిపారని ప్రచారం సాగుతోంది. తులసి పాత్ర కోసం ఆమె సన్నద్ధం అవుతున్నారని కూడా కథనాల బట్టి తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై అటు స్మృతి ఇరానీ నుంచి కానీ ఇటు ఏక్తాకపూర్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.