'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా. థియేటర్లలో సందడి చేసిన సినిమా. ఇప్పుడీ సినిమా ఓటీటీలో కూడా సందడి చేయడానికి రెడీ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా వీడియో... రెండు ఓటీటీ వేదికల్లో మార్చి 25 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. పక్కాగా చెప్పాలంటే... మార్చి 24న అర్ధరాత్రి 12 గంటలకు సినిమా విడుదల కానుంది. థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సందడి మొదలయ్యే సమయంలో ఓటీటీలో 'భీమ్లా నాయక్' సందడి షురూ కానుంది. 

"నెక్స్ట్ ఫ్రైడే ఈ టైమ్ కి, పవర్ స్ట్రోమ్ మీ ఇంటికి వచ్చేస్తుంది. డేట్స్ మార్క్ చేసుకోండి. క్యాలెండర్ ఖాళీగా ఉంచుకోండి. మార్చి 25 నుంచి లా లా... భీమ్లా" అని ఆహా వీడియో పేర్కొంది. "వస్తున్నాడు. హాట్ స్టార్ లో 'భీమ్లా నాయక్'. మార్చి 25 నుంచి డ్యూటీకి, పవర్ కి మధ్య యుద్ధం" అని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పేర్కొంది.


పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటించిన 'భీమ్లా నాయక్'ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. తమన్ సంగీతం అందించారు.