పాసింజర్స్.. 2016లో విడుదలయిన అమేరికన్ సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ చిత్రం. ఇందులో జెన్నీఫర్ లారెన్స్, క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్రల్లో జీవించారు. నాలుగైదు సన్నివేశాల్లో తప్ప సినిమా మొత్తం వీరిద్దరే కనిపిస్తారు. కాబట్టి, ప్రేక్షకులను వారి నటనతో మెప్పించగలగటం గొప్ప విషయం. 


కథ విషయానికి వస్తే, భూమి వదిలి మరొక గ్రహంలో కొత్త జీవితం ప్రారభించాలనుకునే 5000 మందిని ఆ గ్రహానికి తరలించటానికి, అవలాన్ అనే ఒక మెగాస్పేస్ షిప్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఇందులో 258 మంది సిబ్బంది ఉంటారు. భూమి నుంచి హోమ్‌స్టెడ్- 2 అనే గ్రహానికి ప్రయాణిస్తోన్న ఈ స్లీపర్ షిప్, డెస్టినేషన్‌కు చేరటానికి 120 సంవత్సరాల సమయం పడుతుంది. అన్ని సంవత్సరాలు నిద్రలో ఉండటానికి ప్రయాణీకులను హైబర్నేషన్ పాడ్స్ లో ఉంచుతారు. కానీ కేవలం 30 సంవత్సరాలు గడిచిన తర్వాత.. ఒక గ్రహశకలం ఢీకొనడంతో స్పేస్ షిప్ దెబ్బతింటుంది. దీంతో ఒక్క ప్రయాణికుడికి నష్టం కలుగుతుంది. అతనే మెకానికల్ ఇంజనీర్ జిమ్ ప్రెస్టన్‌. హైబర్నేషన్లో ఇంకా 90 సంవత్సరాలు ఉండాల్సింది. ముందుగానే స్పేస్ షిప్ లోపం వల్ల మేల్కొంటాడు. 


ఒక సంవత్సరం ఒంటరిగా ఉన్న తర్వాత, ఆర్థర్ అనే వ్యక్తి కనిపిస్తాడు. అది ఆండ్రాయిడ్ మెషిన్ అని తెలియగానే జిమ్ నిరాశకు లోనవుతాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అప్పుడే హైబర్నేషన్ పాడ్ లో నిద్రపోతున్న అందమైన అరోరా లేన్‌ తన కంట పడుతుంది. ఆమెను ఇష్టపడుతాడు. తర్వాత ఆమెను కూడా నిద్రలేపాలనుకుంటాడు. కానీ అది చాలా తప్పు అని చాలాకాలం ఒంటరిగానే గడుపుతాడు. ఒంటరితనం భరించలేక, ఒకరోజు ఆమెను నిద్రలేపుతాడు. ఆ విషయం  ఆర్థర్‌కు చెప్పి, ఈ సీక్రెట్ తనకు చెప్పొద్దంటాడు. అరోరా నిద్రలేస్తుంది. తిరిగి హైబర్నేషన్‌కు వెళ్లటానికి ప్రయత్నించి.. విఫలమవుతుంది. జిమ్‌తో ప్రేమలో పడుతుంది. వాళ్లిద్దరు ఆ పరిస్థితులకు లొంగి అక్కడే ఆనందంగా ఉండేలా కొత్త జీవితాన్ని ఊహించుకుంటారు. వారి మధ్య ప్రేమే వారికి  ఒంటరిగా బతికే ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఒకరోజు జిమ్ చేసిన మోసం అరోరాకు తెలిసిపోతుంది. 


అత్యున్నత స్థాయి బాస్కెట్‌బాల్ కోర్ట్, డ్యాన్స్‌ఫ్లోర్, రోబోట్ వెయిటర్‌లతో కూడిన రెస్టారెంట్‌లు, లిమిట్‌లెస్ బూజ్‌ ని సర్వ్ చేసే ఆర్థర్.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఎంతకాలమని ఒంటరితనాన్ని భరించగలుగుతారు? కానీ, పరిస్థితులను అంగీకరించటం వల్ల దేన్నైనా ఎదుర్కోవచ్చు అనే పాఠం ఈ సినిమా నేర్పుతుంది. సినిమా మొత్తం ఇద్దరే ఉన్నా, ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఒక్క సీన్ కూడా మిస్ అవకుండా చూడాలనిపించేలా పిక్చరైజ్ చేసిన క్రియేటర్స్ ని మెచ్చుకోవాల్సిందే.


కొద్దిరోజుల తర్వాత మరో టెక్నికల్ లోపం వల్ల ఇంకో పాడ్ దెబ్బతింటుంది. అప్పుడు డెక్ చీఫ్ ఆఫీసర్ గుస్ మేల్కొంటాడు. ఈ సాంకేతిక లోపాలను అతనూ సవరించలేకపోతాడు. చివరికి ఒక డెక్ సిద్ధమవుతుంది. అందులో తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాలని జిమ్ ప్రెస్టన్‌ ఆమెను కొరతాడు. మరి అందుకు ఆమె ఒప్పుకుంటుందా? ఆ తర్వాత కథ ఏమవుతుంది? జిమ్, అరోరా జీవితం అక్కడే ముగిసిపోతుందా? వారు పరిస్థితులను ఎలా మార్చుకున్నారు? అసలు బతికున్నారా? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


(ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఓటీటీ మూవీస్ సజిషన్స్ కోసం.. ABP Desam వెబ్ ‌సైట్‌ను డైలీ విజిట్ చెయ్యండి)


Also Read: ఫ్రెండ్‌తో కోడలు ఎఫైర్ - అత్తను హత్యచేసి మామకు అడ్డంగా దొరికిపోతుంది, ఇక అన్నీ ట్విస్టులే!